జగన్ దెబ్బకు దిగొచ్చి

Update: 2018-03-22 01:30 GMT

ప్రత్యేక హోదా ఉద్యమం ఊపందుకుంది. విపక్షాల వత్తిడికి రాష్ట్ర ప్రభుత్వం కూడా దిగి వస్తోంది. మొన్న మంత్రివర్గం నుంచి వైదొలగడం, ఎన్డీఏ నుంచి అధికార పార్టీ బయటకు రావడం, తర్వాత అవిశ్వాసం పెట్టడం ఇవ్వన్నీ గమనిస్తే అధికార తెలుగుదేశం పార్టీ విపక్షాల వత్తిడికి దిగిరాక తప్పటం లేదు. ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు యూ టర్న తీసుకున్నదీ విపక్షాల వల్లనే. హోదా ప్రజల్లో బలంగా నాటుకుపోవడంతో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో టీడీపీ హోదా రాగాన్ని అందుకుంది.

నేడు జాతీయ రహదారుల దిగ్భంధనం...

ఇక హోదా సాధన కోసం ప్రత్యేక హోదా సాధన సమితి జాతీయ రహదారుల దిగ్భంధానికి పిలుపునిచ్చింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని జాతీయ రహదారులను వామపక్ష పార్టీ నేతలతో కలిసి వైసీపీ కూడా దిగ్భంధించనుంది. పార్లమెంటులో నాలుగు రోజుల నుంచి అవిశ్వాస తీర్మానం పై స్పీకర్ చర్చకు అనుమతించకుండా, మోడీ ప్రభుత్వం ఏపీ పట్ల కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఏపీ విభజన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు జాతీయ రహదారులపై కదం తొక్కనున్నారు.

మద్దతు తెలిపిన చంద్రబాబు....

వైసీపీ ఈ ఆందోళనకు మద్దతు పలకడంతో ఆందోళన ఉధృతమవుతుందని భావించిన తెలుగుదేశం పార్టీ కూడా జాతీయ రహదారుల దిగ్భంధానికి మద్దతు పలికింది. స్వయంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబబునాయుడే ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి విపక్షాలు ఏ కార్యక్రమం చేపట్టినా తమ మద్దతు ఉంటుందని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. అంతేకాదు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఆందోళనలు చేపట్టాలని చంద్రబాబు కోరారు. విజయవాడలోని కనకదుర్గమ్మ వారధిని కూడా దిగ్బంధనం చేయడానికి విపక్షాలు సిద్ధమయ్యాయి.

నేటి జగన్ పాదయాత్ర షెడ్యూల్....

వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 118వ రోజుకు చేరుకుంది. జగన్ ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. చిలకలూరి పేట నియోజకవర్గంలో జగన్ పర్యటన విజయవంతంగా సాగుతోంది. ఈ సందర్భంగా కల్తీ విత్తనాలు, పురుగు మందుల సరఫరాపై పరోక్షంగా మంత్రి ప్రత్తిపాటిపై ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేష్ కు బినామీలుగా మారి అగ్రిగోల్డ్ భూములను టీడీపీ నేతలు స్వాహా చేశారన్నారు. గురువారం ఉదయం జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రను పోలిరెడ్డిపాలెం శివారు నుంచి ప్రారంభిస్తారు. అక్కడి నుంచి లింగంగుంట్ల, అస్రాపురం మీదుగా కావూరు వరకూ ప్రజాసంకల్ప పాదయాత్ర కొనసాగుతుంది.

Similar News