జగన్ దెబ్బకు ఉక్కిరి బిక్కిరి అవుతున్న టిడిపి

Update: 2017-12-18 06:30 GMT

పాదయాత్రలో జగన్ ప్రజల పై కురిపిస్తున్న హామీల వర్షంలో టిడిపి ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఆచరణ సాధ్యం కాని హామీలతో వైసిపి అధినేత ఎలా ప్రజలను మభ్యపెడతారని ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు తప్పుపట్టారు. జగన్ చెప్పే మాటలు జనం తేల్చేస్తారని యనమల వ్యాఖ్యానించారు. రాష్ట్రం అప్పులఊబిలో ఉందని ఆయన ఇచ్చే హామీలు నమ్మొద్దంటూ యనమల స్థాయిలో ప్రచారం ఊపందుకుంది అంటే టిడిపి ఏ స్థాయిలో భయపడుతుందో తెలుస్తుందంటున్నారు విశ్లేషకులు.

డ్వాక్రా రుణాలు వడ్డీతో సహా మాఫీ అన్న జగన్ ...

అనంతపురం జిల్లా ధర్మవరంలో పాదయాత్రలో వున్న జగన్ తాము అధికారంలోకి వస్తే వడ్డీతో సహా డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే పెన్షన్లు వెయ్యి నుంచి రెండువేల రూపాయల కు పెంచుతామని, నిరుద్యోగ భృతి చేనేతలకు 45 ఏళ్ళకే పెన్షన్లు, విద్యార్థులకు భారీ ఉపకార వేతనాలు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో వరం ప్రకటిస్తూ టిడిపి కి కలవరాన్ని మిగులుస్తున్నారు వైసిపి అధినేత. కొత్త కొత్త హామీలు పధకాలు ప్రకటిస్తూ ప్రభుత్వ తీరును ఎక్కడికక్కడ ఎండగడుతూ సాగిపోతున్నారు జగన్.

గతంలో చంద్రబాబు ఇలాగే ...

మీకోసం పాదయాత్రలో ఇలాగే టిడిపి అధినేత ఊరికో హామీలిస్తూ పాదయాత్ర సాగించారు. ఇవి కాక ఎన్నికలముందు ఆయన ప్రకటించిన మ్యానిఫెస్టో అన్ని వర్గాలపై వరాలు కురిపించింది. బాబు ఇచ్చిన వరాల కోసం జనం ఓట్ల వాన కురిపించారు. ఆ తరువాత గెలిచి అధికారంలోకి వచ్చాకా దివాళా తీసిన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఇచ్చిన మాటలు నెరవేర్చడం ఈజీ కాదని తేల్చి చెప్పింది. దాంతో అరవైయేళ్లలో గత ప్రభుత్వాలు తెచ్చిన అప్పులకు పదింతలు తెచ్చి ఏపీ ప్రజలపై లక్షా ఇరవైవేలకోట్ల రూపాయలు రుణాన్ని రుద్దారు బాబు. ఇప్పుడు విపక్ష నేత బాబు రూట్ లో సాగిపోతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఏపీ ఆర్ధిక పరిస్థితి మాత్రం కుక్కలు చింపిన విస్తరి గా మారుతుందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Similar News