చిత్తూరు జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటనను ఆ పార్టీ సీరియస్ గా తీసుకుంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ స్వయంగా పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జులను, ఎమ్మెల్యేలను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ప్రస్తుతం తంబళ్లపల్లి నియోజకవర్గంలో పర్యటిన్తున్న జగన్ తర్వాత మదనపల్లెనియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈనేపథ్యంలో మదనపల్లి వైసీపీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డితో జగన్ పాదయాత్రపై చర్చించారు. చిత్తూరు జిల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా కావడంతో జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏ జిల్లాపై పెట్టని శ్రద్ధ చిత్తూరు జిల్లాపై పెడుతున్నారు జగన్.
బాధ్యులందరితో మాట్లాడుతూ...
చిత్తూరు జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాల్లో 260 కిలోమీటర్ల మేర జగన్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ తొమ్మిది నియోజకవర్గాల బాధ్యులతో జగన్ చర్చించనున్నారు. చిత్తూరు జిల్లాలో మొత్తం 14 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. ఇందులో గత ఎన్నికల్లో ఎనిమిది నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. చంద్రబాబు సొంతజిల్లాలోనే గత ఎన్నికల్లో వైసీపీ జెండా పాతింది. అదే హవాను ఈసారి కూడా కొనసాగించాలన్న పట్టుదలతో జగన్ ఉన్నారు. ముఖ్యంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.
కోర్టుకు హాజరై తిరిగి....
47వ రోజు జగన్ పాదయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. నిన్న హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు హాజరైన జగన్ రాత్రికే తిరిగి బసకు చేరుకున్నారు. ఈరోజు వసంతపురం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. ఉప్పులూరు వాండ్లపల్లి, జి.కొత్తపల్లి క్రాస్ రోడ్స్, గోపిదెన్నె, బోరెడ్డివారి కోట, ఎగువ బోయినపల్లి, చెవిటివాని పల్లి, తంబళ్లపల్లి, బదలవాండ్లపల్లి మీదుగా రామిగాని వారిపల్లి వరకూ ఈరోజు ప్రజాసంకల్ప యాత్ర జరగనుంది. రాయలసీమలో మిగిలిన జిల్లాల్లో జరిగిన పాదయాత్ర ఒక ఎత్తైతే, చిత్తూరు జిల్లాలో జరుగుతున్న పాదయాత్ర మరొక ఎత్తుగా భావిస్తున్నారు.