జగన్ ది ఒంటరి పోరాటమేనా?

Update: 2017-12-02 08:30 GMT

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేస్తున్నారు. నడుంనొప్పి, అరికాళ్లలోబొబ్బలతో ఇబ్బంది పడుతున్నాపాదయాత్ర కొనసాగిస్తున్నారు. కాని వైసీపీ నేతలు మాత్రం పార్టీని పట్టించుకోవడం లేదు. వాస్తవానికి జగన్ పాదయాత్ర ప్రారంభించేముందు హైదరాబాద్ లో అన్ని నియోజకవర్గాల ఇన్ ఛార్జులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేశారు. పాదయాత్ర జరుగుతుండగా నియోజకవర్గాల్లో ఏ కార్యక్రమాలు చేయాలో స్పష్టంగా వివరించారు. పాదయాత్ర ఒక జిల్లాలో జరుగుతున్నప్పుడు మిగిలిన జిల్లాల్లో యువభేరి కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు. అలాగే పల్లె నిద్ర, రచ్చబండ కార్యక్రమాలు చేయాలని చెప్పారు. ప్రతి గ్రామంలో సభలను ఏర్పాటుచేసి నవరత్నాల గురించి ప్రజలకు వివరించాలనిచెప్పారు. ఇక పాదయాత్ర జరగబోయే జిల్లాలో ముందుగానే ఆ జిల్లాలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని జగన్ పదేపదే చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు.

నేతలు పట్టించుకోకపోవడం.....

అయితే వారు చెప్పినదంతా విని వెళ్లిన నేతలు మాత్రం ఈ కార్యక్రమాలు ఏవీ చేయడం లేదు. ఇటీవల ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో పల్లెనిద్ర వంటి కార్యక్రమాన్ని కూడా తూతూ మంత్రంగా నిర్వహించారని పార్టీ అధినేత దృష్టికి కూడా వచ్చింది. జగన్ ఇప్పటికి రెండు జిల్లాల్లో మాత్రమే పర్యటించారు. కడప జిల్లాలో పర్యటన పూర్తి చేసుకోగా, ప్రస్తుతం కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో జగన్ పాదయాత్ర అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. కేవలం అనంతపురంలో పాదయాత్ర ఏర్పాట్లపై సమీక్షలు చేయడం తప్ప నేతలు నియోజకవర్గాల్లో ఏమీ చేయడం లేదని తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ టీం కూడా ఏ నియోజకవర్గాల్లో కార్యక్రమాలు జరగడం లేదన్న విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లింది. అయితే కార్యక్రమం చేపట్టాలంటే ఆర్థిక వనరులు అవసరమవుతాయని కొందరు చెబుతున్నారు. పాదయాత్రకు కూడా తామే చూసుకోవాల్సి వస్తున్నందున ఈ కార్యక్రమాలను చేయలేకపోతున్నట్లు కోస్తా జిల్లాకు చెందిన ఒక వైసీపీ నేత బహిరంగంగానే చెప్పడం విశేషం. కాని జగన్ మాత్రం ఒంటరి పోరాటమే చేస్తున్నారు. నేతల్లో మాత్రం వచ్చే ఎన్నికల్లో గెలవాలన్న పట్టుదల కొరవడింది. ఒక్క రోజా మాత్రం నగరి నియోజకవర్గ సమస్యలపై పాదయాత్ర చేశారు. ఇలా మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఇన్ ఛార్జులు, ఎమ్మెల్యేలు స్పందిస్తే బాగుంటుందని సూచించినా నేతలు చెవికెక్కించుకోలేదని తెలుస్తోంది. మొత్తం మీద జగన్ ఒంటరి పోరాటం చేస్తున్నారు.

Similar News