జగన్ దాటేశారు...!

Update: 2018-02-26 01:30 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పాదయాత్ర 1300 కిలోమీటర్లకు చేరుకుంది. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం నందనమారెళ్ల గ్రామంలో ఆయన పాదయాత్ర 1300 కిలోమీటర్ల మైలు రాయి దాటింది. ఈ సందర్భంగా జగన్ రెడ్డి మొక్కను నాటారు. జగన్ ను పాదయాత్రలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలు కలిశారు. ఆయనను మాదిగ రిజర్వేషన్లకు మద్దతివ్వాలని కోరారు. అయితే వారి కోరికను జగన్ సున్నితంగా తిరస్కరించారు.

మాదిగలపై స్పష్టమైన వైఖరి.....

మాదిగ రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలో ఉందని, తాను రిజర్వేషన్లపై ఎటువంటి హామీ ఇవ్వలేనని జగన్ వారికి మొహమాటం లేకుండా చెప్పేశారు. అయితే మాల, మాదిగలను తనకు రెండు కళ్లు లాంటి వారని, వారి అభివృద్ధికోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కార్పొరేషన్ ద్వారా అత్యధిక నిధులు కేటాయించి వారి అభివృద్ధికి తాను పాటు పడతానని జగన్ చెప్పారు.

రైతుల పక్షానే.....

కనిగిరి నియోజవర్గంలో జగన్ పర్యటనకు మంచి స్పందన లభించింది. వేల సంఖ్యలో జగన్ ను చూసేందుకు తరలి వచ్చారు. వారందరినీ పలకరిస్తూ జగన్ ముందుకు సాగారు. ప్రధానంగా కనిగిరి నియోజకవర్గానికి వెలిగొండ ప్రాజెక్టును తాము అధికారంలోకి రాగానే పూర్తి చేసి సాగు, తాగు నీటిని అందిస్తామన్న జగన్ హామీతో ప్రజలు పెద్దయెత్తున హర్హధ్వనాలు చేశారు. కనిగిరి పాలకేంద్రం రైతులకు ఏడాది నుంచి కోటి రూపాయలు బకాయీ ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా రైతులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై జగన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదనడానికి ఇది ఉదాహరణ అని, ప్రభుత్వంపై వత్తిడి తేవడానికి ఉద్యమ బాట పట్టమని, తమ పార్టీ రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మొత్తం మీద జగన్ పర్యటన కనిగిరి నియోజకవర్గంలో ఊహించని దానికన్నా సక్సెస్ కావడంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

Similar News