వైసీపీ అధినేత దూకుడు పెంచారు. ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ ను క్యాష్ చేసుకోవడంలో ముందుండేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే మార్చి 21వ తేదీన లోక్ సభలో కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశపెట్టాల్సిన అవిశ్వాస తీర్మానాన్ని ఈరోజే ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే వైఎస్సార్సీపీ ఎంపీలు స్పీకర్ కు నోటీసులు ఇచ్చారు. పాదయాత్రలో ఉన్న జగన్ ట్వీట్ కూడా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టిందని, ఆంధ్రప్రదేశ్ హక్కులను సాధించేంత వరకూ పోరాటం కొనసాగిస్తామని వైఎస్ జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలకాలంటూ అన్నీ జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలకు జగన్ స్వయంగా లేఖలు రాశారు.
టీడీపీ మద్దతు....
జగన్ పిలుపుకు టీడీపీ కూడా స్పందించింది. వైసీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలోనే ప్రకటించడం విశేషం. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కలసి పనిచేస్తామని చంద్రబాబు చెప్పారు. ఈవిషయంలో జగన్ తొలి విజయం సాధించినట్లేనని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. లోక్ సభ సెక్రటరీ జనరల్ కు వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి గురువారమే నోటీసులు అందించారు. ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా చెప్పిన కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందని వైసీపీ తను ఇచ్చిన నోటీసులో పేర్కొంది.
వివిధ పక్షాల నేతలను కలిసి.....
ఇప్పటికే వైసీపీ నేతలు స్వయంగా కాంగ్రెస్ పార్టీ లోక్ సభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతల సౌగతారాయ్, బీజేడీ నేత భర్తృహరి మెహతాబ్, టీడీపీ నేత తోటనరసింహం, టీఆర్ఎస్ నేత జితేందర్ రెడ్డి, ఎన్సీపీ నేత తారిఖ్ అన్వర్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మన్ లను కలిసి మద్దతును కోరుతూ లేఖలు ఇచ్చింది. మిగిలిన పార్టీల మద్దతును కూడ గట్టేందుకు హస్తినలో నిన్నటి నుంచి వైసీపీ నేతలు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
మూకుమ్మడి రాజీనామాలకు....
అవిశ్వాస తీర్మానం తర్వాత కూడా కేంద్రం దిగిరాకుంటే వైసీపీ ఎంపీలు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు. ఆ రాజీనామాలు ఈరోజు అయినా ఉండొచ్చని వైసీపీనేత ఒకరు తెలిపారు. రాజీనామాలకు సిద్ధంగా ఉండాలని జగన్ ఇప్పటికే ఎంపీలకు ఫోన్ చేసి చెప్పారు. పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేసిన తర్వాత ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఏపీలో ఉధృతం చేయాలని వైసీపీ నిర్ణయించింది. అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగే చర్చలో ఎటూ కేంద్రం నుంచి ప్రత్యేక హోదాపై స్పష్టత రాదని తెలిసిన వైసీపీ ఎంపీలు ఇప్పటికే మానసికంగా రాజీనామాలకు సిద్ధమయ్యారు. వైఎస్ జగన్ ప్రస్తుతం గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. శుక్రవారం కావడంతో ఆయన సీబీఐ కోర్టుకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చే అవకాశముంది.