జగన్ తీరు ఏమాత్రం మారదా?

Update: 2017-10-23 10:30 GMT

వైసీపీ అధినేత జగన్ ఏమాత్రం మారలేదు. ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు ఇప్పటికీ ఏపీ రాజధానిని తమ సొంతం చేసుకోలేక పోతున్నారు. రాష్ట్రం విడిపోయి నాలుగేళ్లు గడుస్తున్నా పార్టీ కార్యకలాపాలన్నీ హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోనే జరుగుతుండటం ఆ పార్టీకి ఏమాత్రం సెంటిమెంట్ లేదని తెలిసిపోతోంది. జగన్ పొరుగు రాష్ట్ర నేత అన్న విమర్శలు వెల్లువెత్తుతుండటంతో ఇటీవల విజయవాడలో తాత్కాలిక రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రారంభోత్సవానికి కూడా జగన్ హాజరు కాలేదు. అయితే తొలిసారి బీసీ సంఘాల నేతలతో ఇటీవల విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జగన్ సమావేశం కావడంతో పార్టీ నేతలు కొంత ఊరట చెందారు.

అంతా హైదరాబాద్ నుంచే....

అయితే జగన్ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల మొదటివారంలో ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా జగన్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించాలి. అయితే జగన్ ఈసారి కూడా శాసనసభ పక్ష సమావేశాన్ని హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లోనే నిర్వహిస్తుండటం సొంత పార్టీ నేతల్లోనే చర్చనీయాంశంగా మారింది. తొలుత ఈరోజు శాసనసభ పక్ష సమావేశం జరగాల్సి ఉండగా... దానిని ఈ నెల 26వ తేదీకి వాయిదా వేశారు. 26వ తేదీన లోటస్ పాండ్ లోనే శాసనసభ పక్ష సమావేశం జరుగుతుందని పార్టీ కార్యాలయం ప్రకటించింది. అయితే జగన్ పాదయాత్రకు బయలుదేరుతుండటంతో ప్రస్తుతానికి శాసనసభ పక్ష సమావేశం హైదరాబాద్ లోపెట్టారని, పాదయాత్ర లేకుంటే విజయవాడలోనే నిర్వహించేవారమని వైసీపీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద జగన్ తీరులో మార్పు వచ్చినట్లు కన్పించడం లేదన్నది ఆ పార్టీ నేతల నుంచే వస్తున్న విమర్శ.

Similar News