వైఎస్ జగన్మోహన రెడ్డి ని ఇప్పటికీ ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఫ్యాక్షనిస్టుగా అభివర్ణించి ఆడిపోసుకుంటూ ఉంటారు. అయితే కడప జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలను ఒకప్పట్లో శాసించిన వ్యక్తిగా జగన్ తాతయ్య, రాజారెడ్డికి మాత్రం పేరుండేదని అంతా అనుకుంటూ ఉంటారు. తాజాగా జేసీ బ్రదర్స్ లో ఒకరైన జేసీ ప్రభాకర రెడ్డి ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూను గమనిస్తే.. అప్పట్లో రాజారెడ్డి పొరుగుజిల్లాల్లో కూడా తన ప్రభావం చూపేవారని, జేసీ కుటుంబం కూడా ఆయనంటే జడుసుకునేదని అర్థమవుతుంది.
జేసీ బ్రదర్స్ లో చిన్నవాడైన జేసీ ప్రభాకర రెడ్డి తనకు కాస్త కోపం ఎక్కువే అని, దూకుడు గల వ్యక్తిని అని గతంలో అనేకమార్లు టీవీ ఇంటర్వ్యూల్లో లైవ్ లోనే నిరూపించుకున్న నాయకుడు. వారి కుటుంబం ప్రస్తుతం కాంగ్రెస్ పతనం తర్వాత.. తెలుగుదేశం పంచన చేరింది. జగన్ వైపు వెళ్లగల వాతావరణం వారికి లేదు. జగన్ తో సఖ్యత లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన సాగిన రోజుల్లో జేసీ దివాకర రెడ్డి ఎంత సీనియర్ నాయకుడు అయినప్పటికీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా లూప్ లైన్‌లో పెట్టారు. అప్పటి వైషమ్యాలు అలాగే ఉన్నాయి. ఆ నేపథ్యంలో వారు తెలుగుదేశం తప్ప మరో చోటకు వెళ్లలేరు గనుకనే వెళ్లారు అని అంతా అనుకున్నారు.
అయితే వైఎస్ఆర్ తో ఉన్న విభేదాలు ఎలాంటివి? ఎందుకు ఆ గొడవలు వచ్చాయి? వీటికి జవాబులు చాలా మందికి నవతరం వారికి తెలియకపోవచ్చు. జేసీ ప్రభాకరరెడ్డి తాజాగా ఒక టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ.. రాజారెడ్డి తమకు గొడవలు ఉండేవి అని, ప్రాణహాని ఉండేదని వెల్లడించారు. రాజారెడ్డికి భయపడే తాము గన్ లైసెన్సులు తీసుకున్నాం అని కూడా ప్రభాకరరెడ్డి చెప్పడం విశేషం. అదే సమయంలో అనంతపురం జిల్లా రాజకీయాల్లో అప్పట్లో తెలుగుదేశానికి చెందిన పరిటాల రవికి వీరి కుటుంబానికి మధ్య తీవ్రమైన విభేదాలు ఉండేవని కూడా ప్రచారం ఉండేది. అయితే దీనిని ప్రభాకరరెడ్డి ఖండించారు. రాజారెడ్డి వల్ల హాని ఉండేదే తప్ప, పరిటాల రవి కి తాము ఎన్నడూ భయపడేంత పరిస్థితి లేదని ఆయన చెప్పుకొచ్చారు.
అయితే ఇప్పుడు ఒక్క పార్టీలో ఉన్నారు గనుక.. ఒకరి గురించి ఒకరు ఎక్కువ ప్రతికూల వ్యాఖ్యానాలు చేయకపోవచ్చునని , నేతల మాటలకు అర్థాలే వేరులే అని జనం అనుకుంటే తప్పు లేదేమో.