వైసీపీ అధినేత జగన్ బంధువు, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి అధిష్టానం చెక్ పెట్టిందా? అవుననే అనిపిస్తుంది. ఒంగోలు పార్లమెంటు నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని పక్కనే ఉన్న నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు జగన్ పరిశీలకుడిగా నియమించారు. అలాగే ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేనిని కూడా కొంత దూరంగానే పెట్టినట్లయింది. తాజాగా జగన్ చేపట్టిన నియామకాలు ప్రకాశం జిల్లా వైసీపీలో కలకలం రేపుతున్నాయి. ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఏకంగా ముగ్గురు నేతలకు బాధ్యతలను అప్పగించడం పార్టీలో చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరి విభేదాల మధ్య పార్టీ కార్యకర్తలు నలిగిపోతున్నారు. ఇద్దరూ పార్టీ అధినేతకు బంధువులు కావడంతో ఎవరూ ఫిర్యాదు చేయలేని పరిస్థితి.
బాలినేని, వైవీ మనస్థాపం......
అయితే ప్రకాశం జిల్లాలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రకాశం జిల్లాలో మొత్తం పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. నాలుగు నియోజకవర్గాలు బాపట్ల పార్లమెంటు పరిధిలోకి వస్తాయి. ఒక నియోజకవర్గం నెల్లూరు పార్లమెంటు స్థానం పరిధిలోకి వస్తుంది. అయితే ఒంగోలు పార్లమెంటుకు బాలినేనిని, బాపట్ల పార్లమెంటుకు మోపిదేవిని, నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న కందుకూరు నియోజకవర్గానికి కాకాణి గోవర్థన్ రెడ్డిని జగన్ నియమించారు. దీంతో ఒక జిల్లాలకు ముగ్గురు ఇన్ ఛార్జులు ఉన్నారు. వీరందరిపై పరిశీలకుడిగా సజ్జల రామకృష్ణారెడ్డినినియమించారు. జగన్ నియామకాలు బాలినేని వర్గంలో అసంతృప్తిని రగిలించాయి. అలాగే ఎంపీ వైవీ కూడా మనస్థాపానికి గురయినట్లు తెలుస్తోంది. మొత్తం మీద జగన్ ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తున్న జగన్ బంధువులకు కూడా ప్రయారిటీ తగ్గించినట్లు పార్టీలో గుసగుసలు విన్పిస్తున్నాయి.