వైసీపీ అధినేత జగన్ డైరీ రాస్తున్నారు. ప్రతి రోజు ఆయన డైరీలో ఒక పేజీని పాదయాత్రకు కేటాయించారు. గత పది రోజుల నుంచి జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇడుపుల పాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ దాదాపు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర జగన్ చేయనున్నారు. ఇందుకు ఏడు నెలల సమయం పట్టనుంది. అయితే జగన్ మోహన్ రెడ్డి స్వదస్తూరీతో డైరీ రాస్తుండటం పార్టీ వర్గాలను సయితం ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. జగన్ ప్రస్తుతం తొమ్మిదిరోజుల పర్యటనను డైరీలో పొందుపర్చారు. ప్రతి రోజూ ఉదయం 8గంటలకు బయలుదేరే జగన్ రాత్రి 7.30గంటలకు రాత్రి బసకు వెళతారు. బసకు చేరుకోగానే అల్పాహారం తీసుకుని, పాలు తాగిన తర్వాత జగన్ ఒక గంట సేపు డైరీ రాస్తారని పార్టీ ముఖ్యనేత ఒకరు చెప్పారు.
అన్ని వివరాలతో... రోజూ....
అయితే జగన్ డైరీలో తాను పాదయాత్రను ఏ ప్రాంతం నుంచి ఆరోజు ప్రారంభించింది? ఎక్కడెక్కడకు వెళ్లింది? ఎన్ని కిలోమీటర్లు పర్యటించిందీ రాస్తున్నారు. అంతేకాదు తనను ఎవరెవరు కలిశారు? వారి సమస్యలను కూడా జగన్ నోట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా తాను స్వయంగా వింటున్న సమస్యలను మ్యానిఫేస్టోలో పెట్టాలన్నది జగన్ ఆలోచన. అందుకోసమే ప్రతి సమస్యనూ డైరీలో రాస్తున్నారు. అంతేకాదు ఏ నియోజకవర్గంలో రెస్పాన్స్ వచ్చింది? ఏ నేతలు అక్కడ కష్టపడి పనిచేస్తున్నారన్నది కూడా డైరీలో చోటుచేసుకుంటున్నాయట. దీంతో జగన్ డైరీ రేపటి ఎన్నికల్లో కీలకం కానుంది. ఇటు మ్యానిఫేస్టో రూపకల్పనలోనూ, అటు సీట్ల కేటాయింపులోనూ డైరీయే కీలకమవుతుందని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద జగన్ డైరీలో ఎవరి పేర్లు ఉన్నాయో... ఎవరి లేవో? అన్న టెన్షన్ వైసీపీ నేతల్లో నెలకొని ఉంది.