వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర సందర్భంగా అనేక హామీలను గుప్పిస్తున్నారు. ఎంతమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ప్రజల్నికష్టాల్ని చూసిన జగన్ వెంటనే హామీలు ఇచ్చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తాను సమస్యను పరిష్కరిస్తున్నానని చెబుతున్నారు. ఇప్పటికే జగన్ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు దాటింది. ప్రస్తుతం నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతుంది. ముఖ్యంగా జగన్ హామీలన్నీ బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలను టార్గెట్ గా చేసుకుంటూ ఇస్తున్నారు. వీరితో పాటు రైతాంగం, ఉద్యోగులు కూడా ఉన్నారు.
డైరీలో నోట్ చేసుకుంటూ....
జగన్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ ఎప్పటికప్పుడు తన డైరీలో నోట్ చేసుకుంటున్నారు. జగన్ ఇటీవల సభలోనూ తన డైరీయే పార్టీ మ్యానిఫేస్టో అని చెప్పారు. డైరీలో తాను ఇచ్చిన హామీలను ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ వాటిని ఆర్థిక నిపుణులకు కూడా పంపుతున్నారట. ఈ హామీని నెరవేర్చాలంటే ఎంత వ్యయమవుతుందో అంచనా వేయాలని కూడా ఆర్థిక నిపుణులను కోరుతున్నారట. అంత సీరియస్ గా ఉన్నారు జగన్. గత ఎన్నికల సందర్భంగా ఎటువంటి హామీలు ఇవ్వకుండా ఉన్న జగన్ ఈసారి మాత్రం ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో జగన్ పాదయాత్ర పూర్తయి ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది. డైరీలో తాను రాసుకున్న సమస్యలు, ఇచ్చిన హామీలు పార్టీ మ్యానిఫేస్టోగా రూపొందబోతోంది.
అన్ని వర్గాలకూ హామీలు...
అయితే జగన్ గ్రామీణ, మండల ప్రాంతాల్లో ఇచ్చిన హామీలను ఒకసారి చూస్తే.... ప్రతి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యత్ ఇస్తామని చెప్పారు. వెయ్యి రూపాయలు దాటిన ప్రతి చికిత్సకు ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెస్తామన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో బోయ, వాల్మీకి కులాల నుంచి ఒకరికి పార్లమెంటు సీటు ఇస్తానని చెప్పారు. బీసీ సబ్ ప్లాన్ ను తీసుకొచ్చేందుకు ప్రణాళిక రచిస్తున్నామన్నారు. మైనారిటీలకు కూడా సబ్ ప్లాన్ అమలు చేస్తామన్నారు. మసీదుల్లో ఉండే ఇమామ్ లకు జీతాలు ఐదు వేల నుంచి పదివేల రూపాయలకు పెంచుతామన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆలయం, మసీదు, చర్చిలకు నిర్వహణ ఖర్చులను ప్రతి నెల విడుడల చేస్తామని చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని ప్రకటించారు.
అందరినీ ఆకట్టుకుంటూ...
ఇక ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యుటరీ పింఛన్ స్కీమ్ ను రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని తీసుకొస్తామన్నారు. చిత్తూరు, కర్నూలు జిల్లా ఆర్మూరులో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామన్నారు. 45 ఏళ్లకే పింఛను అందజేస్తామన్నారు. అన్ని రకాల పింఛన్లను వెయ్యి నుంచి రెండువేలకు పెంచుతామన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి ఏటా డీఎస్సీని ప్రకటించి ఉద్యోగాలను భర్త చేస్తామన్నారు. లక్షా యాభై వేల మందికి ఉద్యోగాలను కల్పిస్తామన్నారు. ప్రతి గ్రామంలో సచివాలయాన్ని ఏర్పాటు చేసి పింఛను, ఫీజు రీఎంబర్స్ మెంట్ వాటిని 72 గంటల్లో పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. మూసేసిన చక్కెర ఫ్యాక్టరీలను పునరుద్ధరించడం, అధికారంలోకి రాగానే రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేయడం, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు భూమి పంపిణీచేసి అందులో ఉచితంగా బోర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇలా జగన్ హామీలతో ముందుకు వెళుతున్నారు. ఆయన హామీలే వచ్చే ఎన్నికల్లో మ్యానిఫేస్టోగా రూపొందుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద జగన్ డైరీయే మ్యానిఫేస్టో అన్నమాట.