వైసీపీ అధినేత జగన్ 800 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. ఆయన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని నల్లవెంగణపల్లి వద్ద 800 కిలోమీటర్ల మైలు రాయిని దాటారు. అక్కడ గుర్తుగా ఒక మొక్క నాటారు. ప్రతి వంద కిలోమీటర్లకు జగన్ మొక్క నాటుతున్నారు. నవంబరు 6వ తేదీన జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర కడప జిల్లా ఇడుపుల పాయలో ప్రారంభమైంది. నవంబరు నెలలో కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వంద కిలోమీటర్లు చేరుకున్నారు. తర్వాత అదే జిల్లాలోని డోన్ నియోజకవర్గంలో 200 కిలోమీటర్లు, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 300 కిలోమీటర్లు, అనంతపురంజిల్లా గుమ్మేపల్లి లో 400 కిలోమీటర్లు, అదేజిల్లాలోని ధర్మవరం మండలం ఉట్లూరు గ్రామంలో 500 కిలోమీటర్లు, అనంతపురంజిల్లా ఉట్లూరు వద్ద 600 కిలోమీటర్లు మైలురాయిని జగన్ దాటారు. చిత్తూరుజిల్లా జమ్మివారిపల్లె వద్ద 700 కిలోమీటర్లు ప్రయాణించిన జగన్ నిన్న నల్లవెంగణం పల్లి వద్ద 800 కిలోమీటర్ల వరకూ పాదయాత్రను చేసినట్లయింది.
ఎన్ఆర్ఐల సంఘీభావం....
అయితే జగన్ పాదయాత్రకు చిత్తూరు జిల్లాలోని నలుమూలల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు కూడా ఆయన వెంట నడిచేందుకు ఉత్సాహం చూపుతున్నారు. వీరే కాకుండా ఎన్ఆర్ఐలు కూడా జగన్ ను చూసేందుకు వచ్చి ఆయన వెంట నడుస్తున్నారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లెకు చెందిన ఎన్ఆర్ఐ దంపతులు హరిప్రసాద్, సరిత జగన్ వద్దకు వచ్చి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. జగన్ ను చూసి ఆయనను పలుకరించేందుకే తాము వచ్చామని ఎన్ఆర్ఐ దంపతులు చెప్పారు. పాదయాత్ర ద్వారా జగన్ ప్రజలకు మరింత చేరువవుతున్నారని, ఏ పొలిటికల్ లీడర్ కు, సినిమా హీరోకు లేని ప్రజాదరణ జగన్ కు ఉందని వారిరువురూ కొనియాడారు. జగన్ తో సెల్ఫీ దిగారు. జగన్ కూడా వారిని ఆప్యాయంగా పలకరించారు.
నేటి షెడ్యూల్....
ఇక జగన్ పాదయాత్ర 59వ రోజుకు చేరుకుంది. ఈరోజు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం గుండుపల్లి నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. వెదురుకుప్పం, కాపు మొండివెంగనపల్లి, బలిజ మొండివెంగనలపల్లి, కమ్మ కండ్రిగ, బ్రాహ్మణపల్లి, అనుంపల్లి, నెమ్మలగుంటపల్లి, నూతిగుంట పల్లి వరకూ ఈరోజు యాత్ర కొనసాగనుంది. 800 కిలోమీటర్లు జగన్ పాదయాత్ర దాటడంతో చిత్తూరు జిల్లాలో వైసీపీ శ్రేణులు బాణాసంచాను పేల్చాయి. నిన్న జగన్ 12.3 కిలోమీటర్ల మేరకు నడిచారు.