వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్ర ను సక్సెస్ చేస్తున్న నేతలను జగన్ శభాష్ అన్నారు. జగన్ పాదయాత్ర చేస్తూనే విరామం సమయంలో సీనియర్ నేతలతో చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న సంఘటనలపై విశ్లేషణలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం జగన్ పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. అయితే ఈ సందర్భంగా జగన్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమం రెండు రోజులపాటు జరిగిన తీరుపై నేతలతో చర్చించారు. వివిధ జిల్లాల నుంచి జన్మభూమి కార్యక్రమంపై నివేదికను తెప్పించుకున్నారు. కొన్ని చోట్ల జన్మభూమికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడటంపై కూడా ఆయన చర్చించారు. ప్రధానంగా పింఛన్లు, రేషన్ కార్డులు, పక్కా ఇళ్లపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని పార్టీ ఇన్ ఛార్జుల నుంచి నివేదిక అందడంతో జన్మభూమిపై విశ్లేషించారు. జన్మభూమి ప్రభుత్వ కార్యక్రమమైనా పార్టీ ఈవెంట్ గా మార్చేశారని జగన్ అభిప్రాయపడ్డారు.
పులివెందుల విషయం...
ఇక కడప జిల్లా పులివెందులలో జన్మభూమి కార్యక్రమంలో జరిగిన సభలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి జరిగిన అవమానాన్ని కూడా జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలిసింది. ఎంపీ మైకును ఒక కార్యకర్త లాక్కునేందుకు ప్రయత్నంచేసినా తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డుకోలేదని ఆయన ఆవేదన చెందారు. అయితే జన్మభూమి కార్యక్రమాలకు వైసీపీ నేతలు హాజరై ప్రజాసమస్యలపై అధికారులు నిలదీయాలని జగన్ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. జన్మభూమి కార్యక్రమమంతా బోగస్ అని, దానివల్ల ప్రభుత్వం తమ పథకాలను ప్రచారం చేసుకోవడానికి తప్ప ప్రజలకు ఉపయోగం ఏమీ లేదని నేతలు కూడా అభిప్రాయపడ్డారు.
పవన్ భయమే లేదన్న....
ఇక పవన్ కల్యాణ్ విషయం కూడా ప్రస్తావన వచ్చింది. తెలిసో...తెలియకో పవన్ కల్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడం మంచిదేనన్న అభిప్రాయం వ్యక్తమయింది. పవన్ కల్యాణ్ నిలకడలేని వ్యక్తిత్వం దీనిద్వారా ప్రజలకు తెలిసి వచ్చిందని జగన్ నేతల వద్ద అభిప్రాయపడినట్లు సమాచారం. రెండు రాష్ట్రాల్లో అధికారపార్టీకి పవన్ కొమ్ముకాస్తూ.. ప్రతిపక్షాన్ని వీక్ చేయాలని పవన్ చేస్తున్న ప్రయత్నాలను తాము చెప్పకుండానే ఆయనే బయటపెట్టుకుంటున్నారని అన్నట్లు తెలిసింది. పవన్ గురించి పెద్దగా ప్రమాదం ఉండబోదని జగన్ నేతల వద్ద ధీమా వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇక చిత్తూరు జిల్లాలో జరగుతున్న ప్రజాసంకల్ప యాత్రకు పెద్దయెత్తున జనం తరలి వస్తుండటంపైనా జగన్ పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక నేతలను జగన్ అభినందించినట్లు తెలిసింది.