జగన్ చెప్పినా చెవికెక్కించుకోని లీడర్లు

Update: 2017-10-15 06:30 GMT

జగన్ పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తేవాలని తాపత్రాయపడుతుంటే క్షేత్రస్థాయి నేతల్లో మాత్ర ఆ ఆత్రం కన్పించడం లేదు. స్థానిక సమస్యలపై పోరాటం చేయాలని, దాని ద్వారానే ప్రజలకు దగ్గరకు కాగలమని జగన్ నెత్తినోరూ మొత్తుకుంటున్నా సిక్కోలు నేతల చెవికి మాత్రం ఎక్కడం లేదు. వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల గోడును వైసీపీ నేతలు అసలు పట్టించుకోవడం లేదు. సీనియర్ నేతలు ఆ జిల్లాలో ఉన్నా వారు కూడా వంశధార నిర్వాసితుల సమస్యను పక్కన పడేశారు. సీనియర్ నేతలైన ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారామ్ వంటి నేతలు కూడా వారి సమస్యపై వెనక్కు తగ్గడంలో ఆంతర్యమేంటి? ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వంశధార ప్రాజెక్టు పనులను 2018 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు భూసేకరణలో సమస్యలు ఏర్పడ్డాయి. వంశధార నిర్వాసితులు తమకు సరైన నష్టపరిహారం అందలేదంటూ రోడ్డెక్కారు. ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు. ప్రాజెక్టు పనులకు వచ్చిన వాహనాలను కూడా ధ్వంసం చేశారు. వీరిపై లాఠీ ఛార్జి కూడా జరిగింది. అనేక మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోలీసు పహారా మధ్య పనులను కొనసాగిస్తున్నారు.

అఖిలపక్ష కార్యక్రమాల్లో డుమ్మా కొట్టి.....

అయితే వంశధార నిర్వాసితుల పక్షాన ఒక్క సీపీఎం, సీపీఐ మాత్రమే నిలబడ్డాయి. వారే తొలి నుంచి వీరి వెంట నడుస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ శ్రీకాకుళం వచ్చి వంశధార నిర్వాసితుల సమస్యపై మాట్లాడారు. వారికి అండగా నిలుస్తామని చెప్పారు. అయితే జగన్ వెళ్లిపోగానే వంశధార నిర్వాసితులను వైసీపీ నేతలుపట్టించుకోవడం లేదన్న విమర్శ విన్పిస్తోంది. ఆ ప్రాంత లీడరయిన రెడ్డి శాంతి ఒకటికిరెండుసార్లు అక్కడికి వెళ్లి వచ్చినా కేవలం కంటిచూపు మాత్రమే. ఈ నెల 10వ తేదీన ఛలో వంశధారకు అఖిలపక్షం పిలుపునిచ్చింది. అయితే ఈకార్యక్రమానికి వైసీపీ దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. విజయవాడ నుంచి వచ్చిన సీపీఎం, సీపీఐ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అక్రమ అరెస్ట్ లకు నిరసిస్తూ ఈ నెల 12 జిల్లా బంద్ కు అఖిలపక్షం పిలుపు నిచ్చింది. ఈ బంద్ లో కూడా వైసీపీ నేతలు పాల్గొనలేదు. ఇటు అధికార పార్టీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటూ వంశధార నిర్వాసితుల పక్షాన నిలబడరు. కాని ప్రతిపక్షం నిర్వాసితులకు అండగా నిలవాల్సిన సమయంలో పక్కకు తప్పుకుంది. ప్రతిపక్షం... కూడా అధికారపక్షం బాటలో పయనించమేంటన్న చర్చ జిల్లా వ్యాప్తంగా జరుగుతోంది. ఇది వైసీపీకి నష్టం కాదా?

Similar News