ఇక వైసీపీ అధినేత జగన్ కూడా సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? కేంద్ర బడ్జెట్ లో నూతన ఆంధ్రప్రదేశ్ కు ఎటువంటి నిధులు కేటాయించకపోవడం, విభజన హామీల ప్రస్తావన లేకపోవడంపై జగన్ పార్టీ పార్లమెంటు సభ్యులతో చర్చించినట్లు తెలిసింది. ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్ ప్రస్తావన కూడా బడ్జెట్ ప్రసంగంలో లేకపోవడాన్ని జగన్ తీవ్రంగా తప్పుపట్టినట్లు తెలిసింది. బడ్జెట్ అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన తర్వాత పార్టీ సీనియర్ నేతలు విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలతో జగన్ పాదయాత్రలోనే ఫోన్ లో మాట్లాడారు. రాష్ట్రానికి బడ్జెట్ లో జరిగిన అన్యాయంపై ఏ విధంగా నిరసన తెలియజేయాలన్నది వర్క్ అవుట్ చేయాలని వారిద్దరికీ సూచించారు. వెంటనే పాదయాత్ర వద్దకు రావాలని వారిని కోరినట్లు తెలిసింది.
హైదరాబాద్ లోనే భేటీ.....
దీంతో జగన్ రేపో, మాపో శిబిరంలోనే పార్లమెంటు సభ్యులతో భేటీ కానున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే రాజీనామా చేస్తామని గతంలో జగన్ ప్రకటించారు. ప్రత్యేక హోదా ఇవ్వరని ఇప్పుడు స్పష్టంగా తేలిపోయింది. ఈ బడ్జెట్ లో కూడా ఏపీకి మొండి చేయి చూపడంపై జగన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. వీలుంటే ఈ పార్లమెంటు సమావేశాల్లోనే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలని కూడా ఎంపీలకు జగన్ సూచించినట్లు సమాచారం. జమిలి ఎన్నికలు ఉన్నా, లేకున్నా రాజీనామా చేసి ప్రత్యేక హోదా కోసం పోరుబాట పట్టాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే రేపు శుక్రవారం కావడంతో జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చే అవకాశముంది. ఇక్కడే పార్టీ ఎంపీలతో చర్చించనున్నట్లు సమాచారం. హైదరాబాద్ లో నేడు వైసీపీ ఎంపీలు జగన్ తో భేటీ అయ్యే అవకాశముంది.
టీడీపీ నిర్ణయం తీసుకోక ముందే....
మరోవైపు రాజీనామాలు చేస్తే అధికార టీడీపీని కూడా ఇరుకున పెట్టే అవకాశముంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీని వదిలించుకోవాలని చూస్తున్నారు. బీజేపీతో కాకుండా విడిగా పోటీ చేయాలని భావిస్తున్నారు. చంద్రబాబు రెండు, మూడు రోజుల్లోనే తననిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. ఆయన నిర్ణయం తీసుకోకముందే తామే కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని జగన్ అబిప్రాయపడుతున్నారు. ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని జగన్ వ్యాఖ్యనించినా... అది సాధ్యపడదని తేలిపోయింది కాబట్టి జగన్ కొద్ది రోజుల్లోనే ఎంపీల చేత రాజీనామా చేయించే అవకాశముందంటున్నారు వైసీపీ నేతలు. దీనిపై సీనియర్ నేతలతో మరోసారి చర్చించిన తర్వాత రాజీనామాల విషయం ప్రకటించే అవకాశముంది. ఒక్క విభజన హామీ కూడా అమలుకాకుండా ఇంకా పార్లమెంటులో కూర్చుంటే ప్రజలు నమ్మరని జగన్ డిసైడ్ అయ్యారని వైసీపీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద జగన్ క్విక్ డెసిషన్ తీసుకుంటారన్నది ఆ పార్టీ నేతల అభిప్రాయంగా విన్పిస్తుంది.