వైసిపి అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్రకు ఆయన సొంత మీడియా లో తప్ప అధికార పార్టీ మీడియా లో నామమాత్ర ప్రచారం కూడా లభించడం లేదు. ప్రతిపక్ష పార్టీ నాయకుడు ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తుంటే దశాబ్దంన్నర క్రితం టిడిపి మీడియా సైతం వైఎస్ ఆర్ కి అత్యధిక ప్రచారమే కల్పించింది. మారిన మీడియా వైఖరి నేరుగా పార్టీల జెండాలను భుజానికి ఎత్తుకుని సాగుతున్న నేటి రోజుల్లో ప్రభుత్వ అనుకూల మీడియా నుంచి సహకారం ఆశించడం అత్యాశే అవుతుందని వైసిపి భావిస్తోందట. పాదయాత్రకు ముందు మీడియా అధినేతలతో జగన్ సమావేశమై తన ప్రచారం ప్రముఖంగా వచ్చేలా చూడాలని కోరినా ఫలితం లేకపోయింది. దాంతో వైసిపి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు రంగంలోకి దిగారు.
సోషల్ మీడియా టచ్ చేస్తే ఇక జగన్ కనిపిస్తారు ...
సంప్రదాయ మీడియా ఇప్పుడు జనంలో ఎలాగూ లేనందున ఆయా మీడియా యజమానులను ప్రసన్నం చేసుకోవడం కన్నా సోషల్ మీడియా ను నమ్ముకుంటే చాలని వైసిపి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సెలవిచ్చారుట. దాంతో సోషల్ మీడియా లో స్పీడ్ గా వుండే ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్, గూగుల్ వంటి వేదికల్లో మార్కెటింగ్ స్ట్రేటజీతో వైసిపి ప్రచారం హోరెత్తేలా చేయనున్నారు. వీడియో లు ఫోటో లు వార్తలు జగన్ పాదయాత్ర విశేషాలను అన్ని కోణాల్లో కవర్ చేస్తూ క్షణ కణం అప్ డేట్స్ వచ్చేలా వైసిపి పార్టీ ప్లాన్ చేసింది. నెటిజెన్స్ లో చిన్నారులనుంచి 45 ఏళ్ళ వారి వరకు సోషల్ మీడియా లో చురుగ్గా వుంటున్నారు. ఫోర్ జి టెక్నాలజీ అందిరావడంతో గ్రామీణులు సైతం వెబ్ దునియాలో మునిగితేలుతున్నారు. పత్రికలు టివి వార్తలు సైతం అందులో వస్తేనే చూసే పరిస్థితి వచ్చేసింది. దాంతో ఇప్పుడు కొత్త రూట్ లోనే ప్రయాణం చేయాలన్న వైసిపి తాజా వ్యూహానికి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.