జగన్ కొత్త నినాదం...టీడీపీకి ఇరకాటం ..?

Update: 2018-01-29 08:30 GMT

ఎన్నికల్లో ఎడా పెడా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాకా మర్చిపోవడం రాజకీయ పార్టీలకు అలవాటే. ఓట్ల కోసం ఇవ్వని హామీ ఉండదు, చెప్పని మాట ఉండదు. గతంలో ఇలాంటి వాగ్ధానాలను సీరియస్ గా తీసుకునే వారు కాదు. మారిన ఆధునిక సమాచార విప్లవంతో ప్రతివారు సామాజిక మాధ్యమాలద్వారా పాత హామీలపై నేతలు ఏమన్నారో చుడండి అంటూ హల్చల్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చే ముందు తరువాత అంటూ ఎవరికి వారే వీడియో లు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. అలాంటి వాగ్దానాలు, హామీలు, వరాలు విపక్షాలకు సైతం ఆయుధాలుగా మారుతున్నాయి. ఈ వాగ్దాన భంగాలను ప్రజలకు గుర్తు చేస్తూ అధికార పక్షంపై విమర్శల దాడిని తన పాదయాత్రలో తీవ్రం చేస్తున్నారు వైసిపి అధినేత వైఎస్ జగన్.

జగన్ చెప్పిన లెక్క ఇది ...

నెల్లూరు జిల్లా లో పాదయాత్రలో వున్న వైసిపి అధినేత జగన్ ఇప్పుడు నిరుద్యోగ భృతి అంశాన్ని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకువెళుతూ గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ప్రతి ఇంటికి ఒక లేఖ పంపారని అందులో ఉపాధి కల్పిస్తాం, ఉద్యోగం కల్పిస్తాం రెండు ఇవ్వలేకపోతే ఇంటికి రెండువేలరూపాయలు నెలకు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ వాగ్దానం లిఖిత పూర్వకంగా ఇచ్చిన అంశం ప్రస్తావించారు జగన్. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 45 నెలలు అయిందని ఆయన చెప్పిన లెక్క ప్రకారం 90 వేలరూపాయలు ప్రతి ఇంటికి బాకీ పడ్డారని లెక్క కట్టారు విపక్ష నేత.

పాత బకాయీ మాటేమిటి?

గత ఎన్నికల్లో టిడిపి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎలా అమలు చేయలేదో చెబుతూ ఒక వేళ ఎన్నికల ముందు మళ్ళీ ఓట్ల కోసం నిరుద్యోగ భృతి ఇస్తే పాత బకాయి మాటేమిటన్న ప్రశ్న జనం మదిలో నాటుతున్నారు జగన్. దాంతో ఇప్పడు ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి ఇచ్చి ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్న బాబు సర్కార్ ఉలిక్కి పడుతుంది. ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి అంటూ 90 వేలరూపాయల కోసం ప్రజలు డిమాండ్ చేస్తే ఈ పధకం ఇప్పుడు అమలు చేసినా పెద్దగా తమకు ప్రయోజనం ఉండదని లబ్ది దారులు ప్రతి వారు 90 వేలు బాకీ చెల్లించండి అనే నినాదంతో వస్తే ఇబ్బందే అని తమ్ముళ్లు ఆందోళన చెందుతారన్నది వైసిపి ఎత్తుగడ. నిరుద్యోగ భృతి అంశం బాగా వినియోగించుకోవడానికి వైసిపి శ్రేణులు సిద్ధంగా వున్నాయి. వారి ఎత్తుగడ ఏ మేరకు ఫలిస్తుందో రాబోయే కాలం చెప్పనుంది.

Similar News