కిర్లంపూడి నుంచి అమరావతి వరకూ తమ నేత పాదయాత్ర చేస్తారంటే అంగీకరించారా? అదే ప్రతిపక్ష నేత జగన్ ఇడుపుల పాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ పాదయాత్ర చేస్తామంటే ఎందుకు అంగీకరించారు? ఇదీ తూర్పుగోదావరి జిల్లాలో కాపునేతలు సంధిస్తున్న సూటి ప్రశ్న. ముద్రగడ పాదయాత్ర చేస్తానంటే గృహనిర్భంధం చేసి... కాపు నేతలందరినీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన ప్రభుత్వంపై ముద్రగడ అభిమానులు విరుచుకుపడుతున్నారు. తమ నేత మీకు నేతలాగా కన్పించడ లేదా? అని ప్రశ్నిస్తున్నారు. పాదయాత్ర చేయాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని హోంమంత్రి చినరాజప్ప మీడియా సమావేశాలు పెట్టి మరీ ముద్రగడపై విమర్శలు చేస్తారని,అదే జగన్ పాదయాత్రకు అనుమతి తీసుకోకున్నా ఆయనను ఒక్కమాట కూడా అనకపోవడం ఇదేం న్యాయమంటున్నారు ముద్రగడ అభిమానులు.
అమెరికాలో బాబు కుల మీటింగ్ లు....
ఏ నేతలైనా తమ డిమాండ్ల కోసమే ప్రజల్లోకి వెళ్లాలని అనుకుంటారని, కాని ముద్రగడ విషయంలో కక్ష పూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెబుతున్నారు. ముద్రగడ మరోసారి చంద్రబాబు పై ఫైరయ్యారు. కుల మీటింగ్ లకు అనుమతి లేదని చెబుతున్న మీరు అమెరికా వెళ్లి కుల మీటింగ్ లు ఎందుకు పెట్టారని చంద్రబాబును ముద్రగడ ప్రశ్నించారు. కాపు నేతలకు ఇచ్చిన హామీలను ఇంత వరకూ అమలు పర్చకుండా డ్రామాలు ఆడుతున్నది మీరు కాదా అని సూటిగా అడిగారు. ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ గమనిస్తున్నారని సరైన సమయంలో తీర్పు చెబుతారని ముద్రగడ అభిప్రాయపడ్డారు. అయితే టీడీపీ నేతలు మాత్రం ముద్రగడ పాదయాత్రకు, జగన్ పాదయాత్రకు పోలీకే లేదంటున్నారు. తుని సంఘటన జరగడంతోనే ముద్రగడకు అనుమతివ్వడానికి శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు అనుమతించడం లేదని చెబుతున్నారు. మొత్తం మీద ముద్రగడ అభిమానులు ఆయన పాదయాత్ర అడ్డుకోవడం పై మండిపడుతున్నారు.