వైసీపీ అధ్యక్షుడు జగన్ ఒక స్పష్టతతో ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో టిక్కెట్లు సిఫార్సు చేసిన వారికి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో టిక్కెట్ల విషయంలో చేసిన పొరపాట్లను తిరిగి మరోసారి చేయబోనని ఆయన విస్పష్టంగా పార్టీ సీనియర్ నేతలతో చెప్పినట్లు తెలిసింది. నిన్న జగన్ జన్మదినం సందర్భంగా వేడుకలకు హాజరైన సీనియర్ నేతలతో జగన్ ఈ విధమైన వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. కొన్ని చోట్ల సీనియర్ నేతలు వచ్చే ఎన్నికలలో అభ్యర్థిగా వీరేనని కొందరిని ప్రకటించడాన్ని జగన్ తప్పుపట్టారు. ముందుగా ఎవరికీ టిక్కెట్ ఇస్తామని మాటఇవ్వవద్దని తన లెక్కలు తనకు ఉన్నాయని తేల్చి చెప్పారు.
గత ఎన్నికల్లో గందరగోళం....
గత ఎన్నికల్లో టిక్కెట్ల విషయంలో కొంత గందరగోళం జరిగింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో తన బంధువైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి సిఫార్సు చేసిన వారికి టిక్కెట్లు ఆ జిల్లాలో ఇచ్చారు. ముఖ్యంగా కనిగిరి నియోజకవర్గంలో మధుసూదన్ యాదవ్ కు టిక్కెట్ ఇవ్వడాన్ని అప్పుడే కొందరు కనిగిరికి చెందిన నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినా జగన్ అధికారంలోకి వచ్చేస్తామన్న ధీమాతో బాలినేని చెప్పిన వారికి టిక్కెట్ ఇచ్చారు. కాని కనిగిరిలో గెలుపు సాధ్యం కాలేదు.
సిఫార్సులకే పెద్దపీట....
అలాగే విజయవాడలోనూ గౌతంరెడ్డికి టిక్కెట్ ఇవ్వడంలో బంధువుల పాత్ర ఉంది. గౌతంరెడ్డి కార్పొరేటర్ స్థాయి నుంచి వ్యక్తి అయినా అక్కడ ఆ సామాజిక వర్గానికి ఓట్లు పడవని తెలిసినా జగన్ టిక్కెట్ ఇచ్చారు. దీంతో అక్కడ కూడా వైసీపీ ఓటమి పాలయింది. శ్రీకాకుళం, గుంటూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పార్టీ సీనియర్ నేతలు సిఫార్సు చేసిన వారికి టిక్కెట్లు ఇచ్చినా వారు ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో జగన్ ఈసారి టిక్కెట్ల ఎంపిక విషయంలో ఎవరి జోక్యం ఉండకూడదని స్పష్టం చేశారు. ఇటీవలే శ్రీకాకుళం జిల్లాలోసీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు టెక్కలి టిక్కెట్ ను తిలక్ కు ఇస్తున్నామని ప్రకటించడం కూడా వివాదాస్పదమయింది. దీంతో జగన్ ఈసారి టిక్కెట్ల విషయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పైనే పూర్తిగా ఆధారపడినట్లు తెలుస్తోంది. పీకే టీం సర్వే ద్వారానే గెలుపు గుర్రాలకు టిక్కెట్లు ఇవ్వాలన్న యోచనలో జగన్ ఉన్నారు. అందుకే ముందుగానే సీనియర్ నేతలకు పరోక్ష హెచ్చరికలు టిక్కెట్ల విషయంలో జారీ చేసినట్లు తెలుస్తోంది.