ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇందూ టెక్ జోన్ లావాదేవీలకు సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారాలపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన ఫిర్యాదును సీబీఐ కోర్టు స్వీకరించింది. వచ్చేనెల 16వ తేదీన జగన్ కోర్టుకు హాజరుకావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. జగన్ తోపాటు ఈ కేసులో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, శ్యాంప్రసాద్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య, నిమ్మగడ్డ ప్రసాద్ మరికొందరికి కోర్టు సమన్లు జారీ చేసింది.
మనీ లాండరింగ్ కేసు....
మనీలాండరింగ్ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఇందు టెక్ జోన్ వ్యవహారంలో లావాదేవీలు జరిగినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం మామిడిపల్లిలో 250 ఎకరాలను ఇందూటెక్ ప్రాజెక్టుకు అప్పటి వైఎస్ సర్కార్ కట్టబెట్టిందని పేర్కొంది. ఇందూ టెక్ కన్సార్టియానికి ఎటువంటి అర్హత లేకుండా నిబంధనలను పక్కనపెట్టి భూములను అప్పగించడంపై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి అప్పటి ఏపీఐఐసీ ఛైర్మన్ గా ఉన్న బీపీ ఆచార్య సిఫార్సు చేయడాన్ని కూడా తప్పుపట్టింది.
జగన్ సంస్థల్లో పెట్టుబడులు.....
అయితే ఇందూటెక్ కు కేటాయించిన భూములను వెంటనే శ్యాంప్రసాద్ రెడ్డి వాటిని అమ్ముకోవడం ప్రారంభించారు. దీనికి ప్రతిగా జగన్ రెడ్డికి సంబంధించిన కంపెనీల్లో శ్యాంప్రసాద్ రెడ్డి 70 కోట్లు పెట్టుబడిగా పెట్టారంటూ ఈడీ తన ఫిర్యాదులో పేర్కొంది. జగన్ కు చెందిన జగతి పబ్లికేషన్స్ లో యాభై కోట్లు, కార్మిల్ ఏసియా హోల్డింగ్స్ లో 20 కోట్లు శ్యాంప్రసాద్ రెడ్డి పెట్టుబడి పెట్టారని ఈడీ తెలిపింది. దీంతో ఈడీ ఫిర్యాదును విచారణకు స్వీకరించిన కోర్టు జగన్ తో పాటు మిగిలిన వారికి నోటీసులు జారీ చేసింది.