జగన్ కు అన్నీ తెలిసొస్తున్నాయా...?

Update: 2017-12-03 01:30 GMT

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేపట్టి నేటికి 25 రోజులు అయింది. ఆయన వేసే ప్రతి అడుగు విజయానికి చేరువ కావాలని కోరుకుంటున్నారు వైసీపీ నేతలు. అయితే జగన్ మాత్రం తన మనసులో భావాలను ఎప్పటికప్పుడు ప్రజలు ముందుంచే ప్రయత్నంచేస్తున్నారు. నిత్యం ఏసీ గదుల్లో, ఏసీ వాహనాల్లో నాలుగు గోడల మధ్య లీడర్లు, సన్నిహితుల మాటలను వినే జగన్ ఇప్పుడునేరుగా ప్రజాసమస్యలను తెలుసుకోగలుగుతున్నారు. ఆయన ప్రతక్ష్యంగా ప్రజలు పడే బాధలు చూస్తున్నారు. పాదయాత్ర పొడవునా తన వద్దకు వచ్చి ప్రజలు చెప్పుకునే గోడును వింటున్నారు. వాస్తవానికి జగన్ కు క్షేత్రస్థాయిలో పాదయాత్ర ముందు వరకూ ఇన్ని సమస్యలు ఉన్నాయని తెలియకపోవచ్చు. ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నారని ఆయనకు అవగాహన లేకపోవచ్చు. కాని 25 రోజుల పాదయాత్రలోఆయన ఎన్నో తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా పేద, బడుగు వర్గాల ప్రజల నుంచి నేరుగా సమస్యలు వింటున్నారు. వ్యక్తిగత సమస్యలతో పాటు సామాజిక సమస్యలనూ ఆయన ఆకళింపు చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే... జగన్ నిత్యం రాసుకునే డైరీలో ఆయన తన మనసులో మాటను వెల్లడిస్తున్నారు.

జగన్ డైరీలో ఒక పేజీ....

’ఈరోజు నా ప్రజాసంకల్ప యాత్ర పత్తికొండ నియోజకవర్గంలో సాగింది. దారి పొడవునా ఎక్కడ చూసినా పేదరికపు ఛాయలే కన్పిస్తున్నాయి. పత్తికొండ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. వర్షాభావం, కరువు కాటాకాలతో ఈ ప్రాంతం అత్యంత వెనకబడి ఉంది. పాలకుల నిర్లక్ష్యం అడుగడుగునా కన్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని 175 నియోజకవర్గాల్లో పత్తికొండ నియోజకవర్గం 144వ స్థానంలో ఉంది. ఈ ప్రాంత ప్రజలు ఎక్కువగా ప్రభుత్వ సాయం పైనే ఆధారపడుతున్నారు. వారి నిస్సహాయతను ఆధారంగా చేసుకుని మోసపూరిత వాగ్దానాలు చేసి ఓట్లు దండుకోవడం తప్ప పాలకులు వీరిని పట్టించుకోవడం లేదు. మౌర్య చక్రవర్తి అశోకుడు, బ్రిటీష్ పాలకుడు సర్ థామస్ మన్రోల ఏలుబడితో చారిత్రక ప్రాధాన్యత పొందిన ఈ ప్రాంతం ఈరోజు విద్యా, వైద్య రంగాల్లో పూర్తిగా వెనుకబడి పోయింది. సాగు, తాగు నీటి కోసం ఈ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందిని చూసి నాన్నగారు హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా ఈనియోజకవర్గంలోని పందికోన, కృష్ణగిరి రిజర్వాయర్లను, అన్ని చెరువలను నింపి నీటి కొరత తీర్చాలనుకున్నారు. ఈ ప్రాజెక్టు పనులు 85 శాతం పూర్తయినా... మిగిలిన 15 శాతం పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది.’ ఇలా జగన్ తన 23వ రోజు యాత్ర అనుభవాలను డైరీలో పంచుకుంటున్నారు.

ఫిట్ నెస్ కోసం కాదంటూ...

మరోవైపు జగన్ పాదయాత్ర ఫిజికల్ ఫిట్ నెస్ కోసమేనని ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేస్తున్నా జగన్ పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు. కర్నూలు జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న జగన్ పాదయాత్రకు అనూహ్య స్పందన లభిస్తుంది. అన్ని వర్గాల వారూ జగన్ ను కలిసేందుకు వస్తున్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందగా వచ్చి తమ ఈతిబాధలన ప్రతిపక్ష నేతకు చెప్పుకుంటున్నారు. జగన్ కు కూడా సమయం ఉండటంతో వారి బాధలను ఓపిగ్గా వింటున్నారు. మొత్తం మీద వైసీపీ అధినేత జగన్ ప్రత్యక్ష్యంగా ప్రజాసమస్యలను తెలుసుకుంటున్నారు. బాధలను నేరుగా చూస్తున్నారు. అది ఆయన రోజూ రాసే డైరీ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇది ఒకరకంగా జగన్ కు, వైసీపీకి మంచి పరిణామమేనని చెప్పొచ్చు.

ఈరోజు జగన్ షెడ్యూల్....

వైఎస్ జగన్ 25వ రోజు పాదయాత్ర షెడ్యూల్ ఇలా ఉంది. ఆయన ఆదివారం ఉదయం పత్తికొండ నియోజకవర్గం మదనంతపురం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. జొన్నగరి, ఎర్రగుడి మీదుగా తుగ్గలి చేరుకుంటారు. అక్కడ భోజనవిరామానికి ఆగుతారు. తర్వాత తుగ్గలి నుంచి చెరువు తొండకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. శనివారం ఆయన 15.6 కిలోమీటర్ల పాదయాత్రను జగన్ చేశారు.

Similar News