జగన్ కఠిన నిర్ణయం ఇందుకేనా?

Update: 2017-12-27 01:30 GMT

వైఎస్ జగన్ కఠిన నిర్ణయాలను తీసుకుంటున్నారు. సాధారణ ఎన్నికలకు ముందు ఎటువంటి తప్పటడుగులు వేయకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికను తీసుకుంటే అదే అర్థమవుతోంది. కర్నూలు ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయాలని ఆ పార్టీ నేత గౌరు వెంకటరెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని జగన్ తో చెప్పినా ఆయన ససేమిరా అనడం ఇందుకు ఉదాహరణ. మరో ఓటమిని జగన్ ఇష్టపడటం లేదు. సాధారణ ఎన్నికలకు ముందు మరోసారి ఓడిపోయి క్యాడర్ లో నిరుత్సాహం నింపేందుకు జగన్ ఇష్టపడటం లేదు.

మరో ఓటమిని జీర్ణించుకోలేక...

తాను శ్రమించి మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నది...ఒక్క ఎన్నికతో అది మట్టిలో కలిసి పోతుందని జగన్ భావించారు. అందుకే గౌరు వెంకటరెడ్డి ఎంత వత్తిడి తెచ్చినా జగన్ ససేమిరా అన్నారు. ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికతో పోయేదేమీ లేదు.. వచ్చేదేమీ లేదు. కాని దాని ప్రభావం మరో మూడు నెలలు ఉంటుంది. అది పాదయాత్రపై కూడా పడే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే జగన్ నిష్కర్షగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో కూడా టిక్కెట్ల ఖరారు విషయంలో జగన్ కొంత కఠిన వైఖరినే అవలంబించనున్నట్లు కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నిక ద్వారా స్పష్టమైందని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

45వ రోజుకు చేరిన....

ప్రస్తుతం జగన్ అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. 45వరోజు జగన్ పాదయాత్ర ఈరోజు కదిరి నియోజకవర్గంలోని నంబుల పులకుంట నుంచి ప్రారంభం కానుంది. అక్కడి నుంచి దిగువతువ్వపల్లి క్రాస్ రోడ్స్, కొత్తపల్లి క్రాస్ రోడ్స్, మల్లెంవారి పల్లె మీదుగా పాపన్నగారి పల్లికి చేరుకుంటుంది. అక్కడ భోజన విరామానికి జగన్ ఆగుతారు. అక్కడి నుంచి పెడబల్లి మీదుగా పాదయాత్ర ప్రారంభమై బలిజపల్లిలో యాత్ర ముగియనుంది. నేటి రాత్రి జగన్ బలిజలపల్లిలోనే బస చేయనున్నారు.

Similar News