తాము అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యావ్యవస్థను సమూలంగా మారుస్తామని వైసీపీ అధినేత జగన్ హామీ ఇచ్చారు. పూర్తిగా ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇస్తామని స్పష్టం చేశారు. వివిధ అంశాలపై జగన్మోహన్ రెడ్డి జగన్ స్పీక్స్ ద్వారా సోషల్ మీడియాలో పాదయాత్ర సందర్భంగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన విద్యావ్యవస్థపైన తన అభిప్రాయాలను వీడియోలో చెప్పారు. ప్రస్తుత విద్యావ్యవస్థ పేదలకు అందకుండా పోయిందన్నారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ అమల్లోకి తెచ్చిన తన తండ్రి వైఎస్ ఎన్నో పేద కుటుంబాలను ఆదుకున్నారన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఫీజులో మూడో వంతు సొమ్మును కూడా ఇవ్వకుండా విద్యార్థులను చదువుకు దూరం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాదయాత్ర సందర్బంగా ఒక్కొక్క హామీని వరుసగా ఇచ్చుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఫీజు రీఎంబర్స్ మెంట్ పూర్తిగా అమలు చేస్తామని చెప్పారు.
అమ్మ ఒడి కార్యక్రమంలో.....
అందుకోసమే దేవుడి దయవల్ల తాము అధికారంలోకి వస్తే విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెస్తామన్నారు. ముఖ్యంగా పేదల పిల్లలు ఇంజినీరింగ్, వైద్య వృత్తి చదవుకోలేక పోతున్నారన్నారు. అందుకోసమే కిందిస్థాయి నుంచి చదువు వంట పట్టేందుకు అమ్మఒడి కార్యక్రమాన్ని తెస్తామన్నారు. ఈ పథకం కింద ప్రతి తల్లి తన బిడ్డను స్కూలుకు పంపితే ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు. దీనివల్ల పిల్లలకు ప్రాధమిక విద్యలోనే బేస్ ఏర్పడుతుందని జగన్ అభిప్రాయపడ్డారు.
పూర్తిగా ఫీజు రీఎంబర్స్ మెంట్.....
అలాగే ఫీజు రీఎంబర్స్ మెంట్ విషయంలో తన తండ్రికంటే రెండడుగులు ముందుకేసి పూర్తిగా ఫీజు ఇచ్చేస్తామన్నారు. ఇప్పుడు ఇంజినీరింగ్ చదివే విద్యార్థులకు కేవలం 35 వేల రూపాయలు ముష్టి వేసి ఇచ్చినట్లు ప్రభుత్వం ఇస్తుందని, మిగిలిన సొమ్ము కట్టలేక తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొందరు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారని ఆవేదన చెందారు. ఇచ్చే ఆ కొద్ది మొత్తం కూడా సరైన సమయానికి ఇవ్వడం లేదని పాదయాత్రలో తనకు అనేక ఫిర్యాదులందాయన్నారు. అందుకోసమే తాము అధికారంలోకి వస్తే చదువుల విప్లవం తెస్తామని జగన్ స్పీక్స్ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి చెప్పారు.