జగన్ పాదయాత్రకు తొలి దశ రూట్ మ్యాప్ ఖరారయింది. ఇడుపులపాయ నుంచి వచ్చే నెల 6వ తేదీన ప్రారంభమయ్యే జగన్ పాదయాత్ర టీడీపీ బలంగా ఉన్న ప్రాంతం నుంచి వెళ్లేలా వైసీపీ ప్లాన్ చేసింది. వైసీపీ బలంగా లేని ప్రాంతాల్లో కూడా జగన్ పాదయాత్ర కొనసాగేలా ప్రణాళికను రచించారు. నవంబరు 4వ తేదీన తిరుమలకు కాలినడకన జగన్ చేరుకుంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన నేరుగా ఇడుపులపాయ కు చేరుకుంటారు. ఇడుపుల పాయలో వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం జగన్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. కడప జిల్లా నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర కర్నూలు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కర్నూలు జిల్లాలో దాదాపు వంద కిలోమీటర్ల మేరకు పాదయాత్రను ప్లాన్ చేశారు. వైసీపీ నుంచి టీడీపీకి మారిన ఎమ్మెల్యే అఖిలప్రియ నియోజకవర్గమైన ఆళ్లగడ్డ మీదుగా కర్నూలు జిల్లాలో పలు ప్రాంతాల్లో జగన్ పాదయాత్ర చేయనున్నారు. ఇటీవల కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కూడా పార్టీ మారడంతో ఆమెకు పట్టున్న నియోజకవర్గాల్లోనూ జగన్ పర్యటిస్తారు.
టీడీపీ నియోజకవర్గాల నుంచే....
ఇక కర్నూలు నుంచి అనంతపురం జిల్లాలోకి జగన్ పాదయాత్ర ప్రవేశిస్తుంది. అనంతపురం జిల్లాలో 200 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఎక్కువ భాగం టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల నుంచే పాదయాత్ర వెళుతుంది. అనంతపురం నుంచి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించి ఆ జిల్లాలో 210 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేయాలని ప్రణాళిక రచించారు. చిత్తూరు నుంచి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మీదుగా పాదయాత్ర వెళుతుంది. అయితే ఈ పాదయాత్రలో కేవలం 125 నియోజకవర్గాలు మాత్రమే జగన్ పాదయాత్ర ద్వారా టచ్ చేస్తారు. మిగిలిన 50 నియోజకవర్గాల్లో జగన్ బస్సు యాత్ర చేయనున్నారు. జగన్ పాదయాత్ర కోసం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలో పార్టీ నేతలు సన్నాహక కార్యక్రమాలు ప్రారంభించారు. ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. జగన్ రాక కోసం వైసీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి.