వైసీపీ అధినేత జగన్ పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయారు. చుట్టూ జనం... సమస్యలతో కూడి వినతులతో ఆయన హామీల మీద హామీలు ఇస్తున్నారు. ప్రధానంగా రైతులను ఆకట్టుకునేందుకు జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మించిపోయారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు రెండు పంటలకు ఎనిమిది వేల రూపాయలు పెట్టుబడి ఇస్తామని చెబితే.. జగన్ మేనెలలో రైతులకు 12,500లు ఇస్తామని ప్రకటించారు. పెట్టుబడికి రైతులు ఇబ్బంది పడకుండా, దానికోసం వడ్డీలకు తేకుండా ఉంటే రైతుల ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. ప్రకాశం జిల్లాలో జరిగిన రైతు సదస్సలో జగన్ ఈమేరకు హామీలు ఇచ్చారు.
కేసీఆర్ ను మించిపోయి....
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రైతుకు ఉచితంగా 9గంటలూ పగటి పూటనే విద్యుత్తును అందిస్తామని జగన్ తెలిపారు. అంతేకాకుండా రైతులకు వడ్డీల్లేని రుణాలు అందిస్తామని చెప్పారు. రైతుకు ఇచ్చే రుణం మీద వడ్డీని ప్రభుత్వమే కడుతుందన్నారు. జూన్ నెలలో ప్రతి రైతు నాగలి పట్టి సాగుకు సిద్ధమవుతాడని, ఆ సమయంలో రైతుకు అండగా నిలిచేందుకు పెట్టుబడి కింద 12,500లు ఇస్తామని చెప్పారు. అలాగే రైతులు తాము కోరుకున్న చోట ఉచితంగా బోర్లు వేయిస్తామనిచెప్పారు. అలాగే రైతులు ఉత్పత్తి చేసిన పంటలకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రైతులకు అండగా...
ఇందుకోసం రైతులకు అండగా ఉండేందుకు, మద్దతు ధరను కల్పించేందుకు అధికారంలోకి రాగానే మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. పంట నష్టపోయిన రైతుల్లో ధైర్యం నింపేందుకు కేంద్రం సాయంతో రూ.4 వేల కోట్ల పరిహారనిధిని ఏర్పాటు చేస్తామని జగన్ చెప్పారు. వైఎస్ జగన్ హామీతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మూత బడిన సహకార డెయిరీలను తిరిగి తెరిపిస్తామని తెలిపారు. నష్టాల్లో ఉన్న డెయిరీలను లాభాల్లోకి తెస్తామని హమీ ఇచ్చారు. ప్రతి రైతు ముఖంలో ఆనందం చూడటమే తమ లక్ష్యంగా ముందుకు సాగుతామని జగన్ రైతు సదస్సులో జగన్ ప్రకటించారు.
మరోవైపు సెంటిమెంట్ తోనూ....
జగన్ ఒక పక్క వివిధ వర్గాల వారికి హామీలు గుప్పిస్తూనే...మరో వైపు ప్రత్యేక హోదా అస్త్రంతో సెంటిమెంట్ ను ఉపయోగిస్తున్నారు. ఇలా రాజీనామాలు, అవిశ్వాస ప్రకటనలతో ఏపీ రాజకీయాల్లో వేడిపుట్టిస్తూనే వివిధ వర్గాల వారితో జరుగుతున్న సమావేశాల్లో వారికి అండగా నిలబడతానని భరోసా ఇస్తున్నారు. మొత్తం మీద వైఎస్ జగన్ మాత్రం ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయినట్లే కన్పిస్తోంది. పార్టీ శ్రేణుల్లో కూడా ఉత్సాహం నింపేందుకు జగన్ తన పాదయాత్ర ద్వారా ప్రయత్నిస్తున్నారు. ఇలా జగన్ అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతున్నారు.
.