నెల్లూరు జిల్లా చేరుకున్న జగన్ కు ఘన స్వాగతం లభించింది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట చేరుకున్న జగన్ కు అక్కడి పార్టీ శ్రేణులు అఖండరీతిలో స్వాగతం పలికారు. నెల్లూరు జిల్లాలో జగన్ సుమారు 20 రోజుల పాటు పర్యటించనున్నారు. మొత్తం 9 నియోజకవర్గాల్లో 230 కిలోమీటర్ల మేరకు జగన్ పాదయాత్ర చేయనున్నారు. నెల్లూరు జిల్లా జగన్ పార్టీకి గత ఎన్నికల్లో అండగా నిలిచింది. దీంతో జగన్ ఈ జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నా ఈ జిల్లాకు జరిగిందేమీ లేదన్నది వైసీపీ వాదన. స్థానిక సమస్యలనే జగన్ ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించనున్నారు.
స్థానిక సమస్యలపై....
నెల్లూరు జిల్లాలో ఆటోమొబైల్ హబ్ గా చేస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీ ఇంతవరకూ అమలు కాలేదు. ఇక నెల్లూరు సిటీని స్మార్ట్ సిటీ చేస్తానన్నారు. దాని పరిస్థితి అంతే. ఇక నెల్లూరులో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ ను ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇంతవరకూ ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇక సముద్ర తీరప్రాంతం ఉన్న నెల్లూరు జిల్లాకు మెరైన్ ఇన్ స్టిట్యూట్ అనే ఊసే లేకుండా పోయింది. దుగ్గరాజపట్నం పోర్టు అతిగతీ లేకుండా పోయింది. ఇక నెల్లూరు జిల్లాలో ఎరువుల కర్మాగారం ఏర్పాటు చేస్తామని చెప్పిన చంద్రబాబు ఆ మాటే మరిచారు. ఇఫ్కో ఫ్టాక్టరీ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఇక్కడ ఇఫ్కో ఫ్యాక్టరీకి బదులు కిసాన్ సెజ్ ఏర్పాటు చేసినా ఆ భూములన్నీ పరిశ్రమలు రాక వెలవెలబోతున్నాయి. నెల్లూరు జిల్లా దగదర్ది ఎయిర్ పోర్టు మాటే మరచిపోయారు. ఈ అంశాలపైనే ప్రధానంగా జగన్ ఫోకస్ చేయనున్నారు.
చిత్తూరు నేతలకు అభినందనలు...
చిత్తూరు జిల్లాలో పాదయాత్ర విజయవంతమైనందుకు జగన్ పార్టీ నేతలను అభినందించారు.ముఖ్యంగా ప్రజల నుంచి చంద్రబాబు సొంత జిల్లాలో వచ్చిన స్పందనకు ఆయన మురిసిపోయారు. చిత్తూరు జిల్లాలోనే కుప్పం అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని జగన్న ప్రకటించారు. డిసెంబర్ 28న చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లిలోకి ప్రవేశింంచిన జగన్ మొత్తం22 రోజులపాటు ఆ జిల్లాలో పర్యటించారు. చిత్తూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర కొనసాగింది. చిత్తూరు జిల్లాలోకూడా జగన్ లోకల్ సమస్యలను ఎక్కువగా ప్రస్తావించారు. చిత్తూరు డెయిరీ, చెరుకు ఫ్యాక్టరీలను మూసివేత వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. మొత్తం మీద జగన్ ఎక్కడికక్కడ లోకల్ సమస్యలనే ఎక్కువగా ప్రస్తావిస్తూ జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.