జగన్ ఎందుకు అలా చేశారో తెలుసా?

Update: 2017-11-25 12:30 GMT

వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్రలో తొలి సారి అభ్యర్థిని ప్రకటించడం పార్టీలో తీవ్రమైన చర్చ నడుస్తోంది. జగన్ తన సహజ శైలికి భిన్నంగా అభ్యర్థిని ప్రకటించారన్నది పార్టీ నేతల వాదన. మామూలుగా జగన్ ఇప్పటి వరకూ ఏ నేతకూ టిక్కెట్ పై స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నది పార్టీ ఇన్నర్ వర్గాల టాక్. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి పాదయాత్రను ప్రారంభించిన జగన్ ఇప్పటికి పది నియోజకవర్గాల్లో పర్యటించారు. కాని ఎక్కడా అభ్యర్థిని ప్రకటించలేదు. ఆళ్లగడ్డ వంటి నియోజకవర్గాల్లో సయితం అభ్యర్థిని పరిచయం చేయలేదు. అక్కడ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు నాని సీటుకోసం పోటీ పడుతున్నారు. పాదయాత్ర ఏర్పాట్లను కూడా గంగుల ఫ్యామిలీయే చేసింది. జనం నుంచి కూడా పాదయాత్రకు విపరీతమైన రెస్పాన్స్ లభించింది. అయినా ఆళ్లగడ్డ అభ్యర్థిని మాత్రం జగన్ ప్రకటించలేదు.

మాట ఇచ్చాననేనా...?

ఇక బనగానపల్లి, డోన్ నియోజకవర్గాల్లోనూ పర్యటించారు. డోన్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి పక్కనే ఉన్నారు. కాని వచ్చే ఎన్నికల్లో ఈయనకే ఓటు వేయాలని జగన్ ఎక్కడా చెప్పలేదు. కాని పత్తికొండకు వచ్చేసరికి జగన్ అకస్మాత్తుగా పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. చెరుకులపాటి శ్రీదేవిని 2019 ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించారు. చెరుకులపాటి నారాయణరెడ్డి హత్యకు గురైన నేపథ్యంలో అంత్యక్రియలకు హాజరైన సమయంలోనే నారాయణరెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ఆదుకుంటానని జగన్ మాట ఇచ్చారు. అందుకే నారాయణరెడ్డి సతీమణి శ్రీదేవిని అభ్యర్థిగా ప్రకటించారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కేఈ కుటుంబాన్ని ఢీకొట్టాలంటే నారాయణరెడ్డి ఫ్యామిలీయే సరైనదని జగన్ భావించడమే కాకుండా, పత్తికొండలో వైసీపీ క్యాడర్ దెబ్బతినకుండా ఉండేందుకే జగన్ తన తొలి అభ్యర్థిని ప్రకటించారన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి. సెంటిమెంట్ గా కూడా తనకు కలిసి వస్తుందని జగన్ భావించి ఉండవచ్చని అనుకుంటున్నారు.

Similar News