జగన్ ఈ డెసిషన్ తీసుకుంటే లాభమా? నష్టమా?

Update: 2017-12-13 01:30 GMT

నిన్న మొన్నటి వరకూ జగన్ ఆ పదం పెద్దగా ఉపయోగించలేదు. కాని కొద్దిరోజుల నుంచి జగన్ దానిని ప్రతి సమావేశంలో హైలెట్ చేస్తున్నారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా సెంటిమెంట్ గా మారింది. అయితే ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం, ఇక్కడ అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్ ప్రత్యేక ప్యాకేజీకి ఓకే చెప్పడంతో ప్రత్యేకహోదా ఇక రాదని తేలిపోయింది. అయితే ఏపీ ప్రజల సెంటిమెంట్ గా ఉన్న ప్రత్యేక హోదాను ఇక హైలెట్ చేసుకుంటూ వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నట్లుంది. గత రెండు రోజులుగా ప్రత్యేక హోదా ప్రస్తావన ప్రముఖంగా తెస్తున్నారు. దీన్ని బట్టి ఈపార్లమెంటు సమావేశాల్లో వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం సభను స్థంభింప చేసే అవకాశముంది. అంతేకాదు ప్రత్యేకహోదాపై ప్రయివేటు బిల్లుకూడా ఉండటంతో వైసీపీ ఎంపీలు విధిగా సభలకు హాజరుకావాలని ఆదేశించారు. దీనిపై స్పష్టత రాకుంటే పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత ఎంపీలు రాజీనామా చేసే అవకాశం ఉంటుందని వైసీపీ వర్గాలు వెల్లడించాయి.

ఎమ్మెల్యేలతో కూడా.....

మరోవైపు జగన్ పార్టీ ఎంపీల రాజీనామాలపై ఇటీవల తరచూ చంద్రబాబు పదే పదే ప్రశ్నిస్తుండటం కూడా ఆ పార్టీని ఇరకాటంలోకి నెట్టేసింది. దీంతో జగన్ ఇక రాజీనామాలకే సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఎంపీలతో పాటు ఎమ్మెల్యేల చేత కూడా రాజీనామా చేయించాలన్న యోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. ఇక ఎన్నికలకు ఏడాది మాత్రమే గడువు ఉండటం, పాదయాత్రలో తాను మరో ఏడునెలల పాటు ఉండటం వల్ల ఇక అసెంబ్లీకి కూడా వెళ్లేది లేదని, అందువల్ల ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యేల రాజీనామా విషయంపై త్వరలోనే వారితో సమావేశం కావాలని కూడా నిశ్చయించారు. అయితే రాజీనామాలకు ఎమ్మెల్యేలు అధికశాతం మంది సుముఖత వ్యక్తం చేస్తుండగా కొందరు మాత్రం ఎంపీలు రాజీనామా చేస్తే సరిపోతుందని అభిప్రాయపడుతున్నారు.

నేడు కూడా రాప్తాడులోనే....

జగన్ పాదయాత్ర 34వరోజుకు చేరుకుంది. 34వరోజు కూడా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోనే పర్యటిస్తారు. ఉదయం 8 గంటలకు జగన్ పాదయాత్ర అనంతపురం రూరల్ మండలం పాపంపేట బైపాస్ రోడ్డు నుంచి ప్రారంభమవుతుంది. రుద్రమపేట, సవేరా ఆసుపత్రి క్రాస్ రోడ్స్, కాకలపల్లి క్రాస్ రోడ్స్, డాల్ఫిన్ హోటల్ మీదుగా ప్రసన్న పల్లి వరకూ పాదయాత్ర జరుగుతుంది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం చిన్మయ్ నగర్ మీదుగా రాప్తాడు చేరుకుంటుంది. అక్కడ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ఈరోజు సాయంత్రం గంగలకుంట బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు.

Similar News