జగన్ ఇలా ఎందుకు చేస్తున్నారంటే?

Update: 2018-04-03 03:30 GMT

వైసీపీ ఉన్నది ప్రజల కోసం కాదని, స్వార్థ ప్రయోజనాల కోసమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రయోజనాలు, సమస్యలపై చర్చించే శాసనసభకు మాత్రం జగన్ రాడని, రాజకీయ ప్రయోజనాన్ని ఆశించే జగన్ ప్రత్యేక హోదా నినాదాన్ని అందుకున్నారన్నారు. కేవలం కేసుల నుంచి బయటపడేందుకే జగన్ మోడీతో కుమ్మక్కయ్యారని చంద్రబాబు ఆరోపించారు.

కేంద్రప్రభుత్వంపై....

కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం చేస్తున్నా జగన్ తన కేసుల కోసమే కేంద్రంపై ఒక్క మాట మాట్లాడటం లేదన్నారు. లోపాయి కారీ ఒప్పందాన్ని బీజేపీతో కుదుర్చుకున్న జగన్ ప్రజల మద్దతును పొందేందుకు బయట రాజీనామాలు, ఆమరణ దీక్షల డ్రామాలు ఆడుతున్నారని చంద్రబాబు తప్పుపట్టారు. తాను ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించడం లేదన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే తన ముందున్న లక్ష్యమని చంద్రబాబు వివరించారు.

హిందీ, ఇంగ్లీషు భాషల్లో.....

చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో మోడీ ఇచ్చిన హామీలు, విభజన చట్టంలో పొందుపర్చిన హామీలు, రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన హామీలు అన్నింటిని కలిపి నివేదికను రూపొందించారు. వీటిని హిందీ, ఇంగ్లీషు భాషల్లో రూపొందించారు. ఈరోజు హస్తిన పర్యటనలో చంద్రబాబు జాతీయ పార్టీల నేతలను కలిసినప్పుడు ఈ నివేదికలను వారికి ఇవ్వనున్నారు. ప్రత్యేక హోదాతో పాటు 18 హామీల గురించి ఈ నివేదికలో పేర్కొనడం విశేషం. మొత్తంమీద చంద్రబాబు పర్యటన కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయంతో పాటు, ప్రతిపక్ష వైసీపీ వ్యవహారాన్ని కూడా ఆయన జాతీయ నేతల వద్ద ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది.

Similar News