జగన్ ఇందుకోసమే భయపడ్డారా?

Update: 2017-12-25 13:30 GMT

జగన్ తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా....? కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని తీసుకున్న నిర్ణయం పార్టీలోనే సంచలనం కల్గించింది. జగన్ ప్రస్తుతం పాదయాత్రలో ఉన్నారు. ఆయన అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. రేపు నామినేషన్ కు ఆఖరి గడువు కావడంతో కర్నూలులోనే స్థానిక నేతలు సమావేశమయి అభ్యర్థి ఎంపికపై ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించారు. జగన్ అనంతపురం జిల్లాలో ఉండగా, కర్నూలు జిల్లా నేతలు మాత్రం ఉదయం నుంచి సమావేశమై అభ్యర్థి ఎంపిక పై చర్చించారు. గౌరు వెంకటరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి కుటుంబం నుంచి ఒకరు, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుమారుడి పేర్లు ఉదయం నుంచి హల్ చల్ చేశాయి.

ఉదయం నుంచి హైడ్రామా....

టీడీపీ అభ్యర్థి ప్రకటించిన దానిని బట్టి తమ అభ్యర్థిని ప్రకటిస్తామని ఉదయం నుంచి వైసీపీ నేతలు చెబుతూ వచ్చారు. అయితే చివరకు కర్నూలు ఎమ్మెల్సీ బరిలో ఉండటం లేదని ఆ పార్టీ నేతలు ప్రకటించడం చర్చనీయాంశమైంది. అయితే జగన్ ఎప్పుడో కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారట. కాని ఆ విషయాన్ని స్థానిక నేతల చేతనే చెప్పించాలన్నది ఆయన వ్యూహం. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలంటే ఖర్చుతో కూడుకున్నది. క్యాంప్ లు ఏర్పాటు చేయాలి. ఎలా కాదన్నా.... పది కోట్లు కనీసం ఖర్చవుతుంది. ఆ ఖర్చును భరించేందుకు ప్రస్తుతం ఎవరూ లేరన్నది వాస్తవం. అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేదని స్థానిక నేతల చేతనే జగన్ చెప్పించారు.

ప్రజాప్రతినిధులు చేజారిపోకుండా....

ఒకవేళ ఖర్చుకు సిద్ధపడి బరిలోకి దిగినా గెలుపు గ్యారంటీ లేదు. కర్నూలు జిల్లాలో వైసీపీకి దాదాపు 300 నుంచి 400 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఉన్నారు. ఒకవేళ ఎన్నికల బరిలోకి దిగితే వీరిపై కూడా టీడీపీ వల వేస్తుందని జగన్ భావించారు. డబ్బులు, పదవులు ఎర చూపి వారిని లాగేసుకుంటే... వచ్చే ఎన్నికల్లో పార్టీ మరింత వీక్ అవుతుందన్న ఆలోచనే వైసీపీ పోటీకి విముఖత చూపినట్లు సమాచారం. అసలు ఎన్నికే లేకపోతే బేరసారాలుండవు. తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పార్టీలోనే ఉంటారు. అందుకే జగన్ చివరి నిమిషంలో స్థానికసంస్థల ప్రతినిధులతో ఈ విషయాన్ని చెప్పించారు. ఇప్పుడు కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నిక దాదాపు ఏకగ్రీవమయ్యే అవకాశాలున్నాయి.

Similar News