జగన్ ఆచి...తూచి

Update: 2018-02-25 01:30 GMT

వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు ఆచితూచి మాట్లాడుతున్నారు. గతంలో ‘‘నేను సీఎం అయిన తర్వాత’’ అనే పదం జగన్ నోటి వెంట వచ్చేది. అయితే ఇప్పుడు పాదయాత్ర ఫలితమో... లేక అనుభవం తెచ్చిపెట్టిన తంత్రమో తెలియదు కాని జగన్ ఆ పదాన్ని పక్కనపెట్టేశారు. ‘‘దేవుడి దయవల్ల మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే... మీ అందరి ఆశీర్వాదంతో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే’’ అన్న వాక్యాలనే జగన్ జపిస్తున్నారు. తన వెంట పాదయాత్రకు వచ్చే వారితోనూ, నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లోనూ జగన్ ఇదే మాటలు మాట్లాడుతున్నారు. జగన్ లో వచ్చిన ఈ మార్పును చూసి వైసీపీ నేతలే ఆశ్చర్యపోతున్నారు.

గతం కంటే భిన్నంగా.....

జగన్ గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి కొంత ఇబ్బందుల పాలయ్యారు. చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలకు దిగడం, చంద్రబాబును ఏకవచనంతో సంభోదించడం ఆయన పట్ల ప్రజల్లో నెగిటివ్ థృక్పధం ఏర్పడింది. అయితే ఇది తెలుసుకున్న జగన్ పాదయాత్ర లో స్వరం మార్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు మీద విమర్శలు చేసినా గౌరవంగా చేస్తున్నారు. చంద్రబాబు రాష్ట్రానికి అన్యాయం చేశారని మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు మాటమార్చిన విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నారు. రాజీనామాలు, అవిశ్వాసానికి ముందుకు రాకుండా చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శిస్తన్నారు.

స్థానిక సమస్యలను....

కనిగిరి నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో కూడా ఆయన ప్రభుత్వ పథకాలు, జన్మభూమి కమిటీల్లో జరుగుతున్న అవినీతి, చంద్రబాబు ఎన్నికల వేళ ఇచ్చిన హామీల విషయాన్ని ఎక్కువగా ప్రస్తావించారు. స్థానిక సమస్యలపై మాట్లాడుతున్నారు. కనిగిరి పట్టణంలో ఫ్లోరైడ్ బాధితులు ఇంతమంది ఉన్నా చంద్రబాబు వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా మంచినీరు ఇచ్చే దిక్కులేకుండా పోయిందని విమర్శించారు. దేవుడి దయతో, మీ ఆశీర్వాదంతో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏడాదిలోపే కనిగిరి నియోజకవర్గానికి మంచినీరందిస్తానని హామీ ఇచ్చారు. కనిగిరి ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి తాగు, సాగునీరందిస్తామని చెప్పారు. ఇలా జగన్ స్థానిక సమస్యలపై స్పందిస్తూ ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ప్రజలచేతనే చెప్పిస్తుండటం విశేషం.

నేటిపాదయాత్ర షెడ్యూల్....

ఇక జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర 97వ రోజు షెడ్యూల్ ఖరారయింది. ఆదివారం ఉదయం 8గంటలకు జగన్ శిబిరం నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నార. టకారిపాలెంనుంచి చల్లగిరగల చేరుకుంటారు. అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడి నుంచి గద్దమీదపల్లి క్రాస్ రోడ్స్, నందన మారెళ్లకు చేరుకుంటారు. అక్కడ కూడా పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి యడవల్లికి చేరుకుని మధ్యాహ్నం భోజన విరామానికి ఆగుతారు. భోజన విరామం అనంతరం సాయంత్రం పెదారికట్లకు చేరుకుంటారు. పెదారికట్లలో రాత్రి బస చేస్తారు.

రు.

Similar News