జగన్ అలర్ట్ అయి ఏం చేస్తున్నారంటే?

Update: 2017-10-07 03:30 GMT

ఏపీలో వైసీపీపై ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగిస్తున్నారని తెలియడంతో వైసీపీ అధినేత జగన్ అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా ప్రస్తుత ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ ఇన్ ఛార్జులను, మాజీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందన్న వార్తలతో జగన్ నష్ట నివారణ చర్యలకు దిగారు. ముఖ్యంగా రాయలసీమ నేతలు ఎక్కువగా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. అందులో అనంతపురం, కర్నూలు నేతలు పార్టీని వీడుతున్నారన్న సంకేతాలు వస్తున్నాయి. జగన్ పాదయాత్ర కంటే ముందుగానే వారిని పార్టీలో చేర్చుకుని మానసికంగా దెబ్బకొట్టాలని టీడీపీ భావిస్తుంది. ఈనేపథ్యంలో జగన్ జిల్లాల వారీగా నేతలతో సమావేశమవతున్నారు. ఈరోజు కర్నూలు జిల్లా నేతలతో జగన్ సమావేశమై పరిస్థిితిని సమీక్షించనున్నారు. వారితో మనసు విప్పి మాట్లాడి వారి సమస్యలు, నియోజకవర్గాల్లో వారికెదురవుతున్న ఇబ్బందులేమిటో జగన్ స్వయంగా తెలుసుకోనున్నారు. లోటస్ పాండ్ లో ఈరోజు జరిగే సమావేశానికి కర్నూలు జిల్లా నేతలందరికీ ఆహ్వానాలందాయి.

నేడు కర్నూలు నేతలతో భేటీ.......

ముఖ్యంగా రాయలసీమలో 11 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ పార్టీని వీడుతారన్న ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతోంది. వీరంతా ఈ నెల 10వ తేదీన టీడీపీలో చేరతారని పెద్దయెత్తున ప్రచారం నడుస్తోంది. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, గౌరు చరితారెడ్డి, గుమ్మనూరు జయరాం, మాజీ ఎమ్మెల్యే గురునాధ రెడ్డి తదితరులు పార్టీని వీడతారన్న ప్రచారం వైసీపీ నేతలను ఊపిరి సలపనీయడం లేదు. అయితే వీరంతా తాము పార్టీని వీడమని మీడియా ముందు బాహాటంగా చెప్పారు. అయితే గతంలో బాహాటంగా చెప్పిన వారే పార్టీని వీడిన సంఘటనలు ఉండటంతో జగన్ అప్రమత్తమయ్యారు. పార్టీ నేతలతో సమావేశమై వారికి భవిష్యత్ పై జగన్ భరోసా కల్పించనున్నారు. లేకుంటే రోజూ ఇలాంటి వార్తలతో పార్టీకి చికాకులొస్తాయని జగన్ భావిస్తున్నారు. ఈరోజు కర్నూలు జిల్లాతో ప్రారంభమయ్యే భేటీ అన్ని జిల్లాల నేతలతో కొనసాగుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.

Similar News