జగనన్నతోనే ఉంటామంటున్న ఎమ్మెల్యేలు

Update: 2017-10-06 04:30 GMT

కొన్ని మీడియాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలను ఎమ్మెల్యేలు ఖండిచారు. తాము వైఎస్సాఆర్ పార్టీని వీడేది లేదని చెప్పారు. గత కొంతకాలం నుంచి కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ వీడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రారంభించే లోపే ఈ వలసలు ఉంటాయని భారీగా ప్రచారం జరిగింది. పాదయాత్రకు ముందే జగన్ ను దెబ్బ కొట్టాలన్న టీడీపీ వ్యూహంలో భాగంగా అనేకమంది ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి చేరుతారన్న ప్రచారంతో వైసీపీలోనూ టెన్షన్ మొదలయింది. అయితే వైసీపీ సీనియర్ నేతలు ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతూ పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. వైఎస్ కుటుంబ కార్యక్రమం, నవరత్నాల సభలనూ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత రెండు రోజుల నుంచి వైసీపీ నేతలు పార్టీని వీడుతున్నట్లు ప్రచారం ఊపందుకుంది.

మైండ్ గేమ్ లో భాగమేనంటున్న.....

దీంతో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తెగేసి చెప్పారు. తానువైసీపీని ఎట్టిపరిస్థితుల్లో వీడేది లేదన్నారు. తనపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, వైసీపీ అధినేత జగన్ తో తనకు ఎటువంటి విభేదాలు లేవని ఎంపీ బుట్టారేణుక చెప్పారు. తాను టీడీపీలోకి వెళుతున్నట్లు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. అలాగే మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి కూడా పార్టీని వీడతారన్న ప్రచారం జరిగింది. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాట్లాడారు. తాను వైసీపీలోనే కొనసాగుతానని, కొందరు మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆయన చెప్పారు. అలాగే ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కూడా తన చేరికను ఖండించారు. తాను ఊపిరి ఉన్నంత వరకూ వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. మూడేళ్ల నుంచి అధికార పార్టీ నేతలతో అవమానాలను ఎదుర్కొంటూ వస్తున్నామని, తామెందుకు టీడీపీలో చేరతామని వారు ప్రశ్నిస్తున్నారు. కేవలం అసత్య ప్రచారం చేసి వైసీపీని ప్రజల్లో చులకన చేయడానికే కొందరు కుట్ర పన్నుతున్నారని వారు అభిప్రాయపడ్డారు.

Similar News