వైసీపీ గుర్తు మీద గెలిచి టీడీపీలోకి జంప్ అయిన నియోజకవర్గాల మీదనే ఎక్కువ జగన్ దృష్టి కేంద్రీకరిస్తున్నారు. నేడు కోడుమూరు నియోజకవర్గంలోకి జగన్ పాదయాత్ర ప్రవేశించనుంది. జగన్ పాదయాత్ర 18వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం పత్తికొండ నియోజకవర్గంలో జగన్ పర్యటన కొనసాగుతుంది. ఈరోజు కోడుమూరు నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. కోడుమూరు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా మణిగాంధీ యాభైవేల మెజారిటీతో గెలుపొందారు. అయితే ఆయన తర్వాత వైసీపీిని వీడి టీడీపీ కండువా కప్పేసుకున్నారు. ఈ నియోజకవర్గంలో జగన్ పర్యటించడం ఆసక్తిగా మారింది.
కోడుమూరులో జగన్....
మరోవైపు కోడుమూరు అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఫ్యామిలీకి కంచుకోట. ఆ ఫ్యామిలీకి పట్టున్న నియోజకవర్గం. అయితే కోట్ల ఫ్యామిలీ ప్రస్తుతం కాంగ్రెస్ లోనే కొనసాగుతోంది. వైసీపీలో చేరే అవకాశముందని, కాదు..కాదు... టీడీపీలో చేరతారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జగన్ కోడుమూరు నియోజకవర్గంలో పర్యటిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం జగన్ పత్తికొండ నియోజకవర్గం రామకృష్ణాపురం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి ఎర్రగుడికి చేరుకుంటారు. తర్వాత కోడుమూరు నియోజకవర్గంలోని గోరంట్లకు జగన్ పాదయాత్ర చేరుకుంటుంది. సాయంత్రం వెంకటగిరిలో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. వెంకటగిరిలోనే జగన్ రాత్రి బస చేయనున్నారు.