జంపన్న ఒకే అంటే ఈ సీటు గ్యారంటీ...!

Update: 2018-01-08 00:30 GMT

ఇటీవ‌ల లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర‌క‌మిటీ స‌భ్యుడు జంప‌న్న రాజ‌కీయాల్లోకి రానున్నారా..? ఒక‌వేళ వ‌స్తే ఏ పార్టీలోకి..? అధికార పార్టీ కీల‌క నేత స‌హాయంతో లొంగిపోయిన జంప‌న్న టీఆర్ఎస్‌లోనే చేరుతాడ‌ని, పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయ‌న స్వ‌గ్రామం మానుకోట జిల్లా తొర్రూరు మండ‌లం చెర్ల‌పాలెం. ఈ గ్రామం మాత్రం జ‌న‌గామ జిల్లా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో ఉంది. అయితే ఆయ‌న పాల‌కుర్తి రాజ‌కీయాల్లో కీల‌క‌పాత్ర పోషిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

గతంలోనూ మావోయిస్టులకు....

గ‌తంలో ఇదే జిల్లాకు చెందిన ధ‌న్వంత‌రి అన‌సూయ (సీత‌క్క‌) కూడా మాజీ న‌క్స‌లైట్‌గా ఉండి క్రియాశీల‌క రాజ‌కీయాల్లోకి వ‌చ్చి స‌క్సెస్ అయ్యారు. మాజీ న‌క్స‌లైట్‌గా ఉన్న సీత‌క్క టీడీపీలో చేరారు. చంద్ర‌బాబు 2009లో ఆమెకు ములుగు సీటు ఇవ్వ‌గా ఆమె విజ‌యం సాధించారు. కొద్ది రోజుల క్రితం ఆమె కాంగ్రెస్‌లో చేరిన సంగ‌తి తెలిసిందే. దీంతో జంప‌న్న కూడా తాను ప్ర‌జాక్షేత్రంలో రాణిస్తాన‌న్న ధీమాతో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక అన్ని వ‌ర్గాల వారిని ఆక‌ట్టుకుంటోన్న కేసీఆర్ మావోయిస్టుగా ఉన్న జంప‌న్న‌కు కూడా అసెంబ్లీ సీటు ఇచ్చే అంశంపై ఆలోచ‌న చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. జంప‌న్న జ‌న‌గామ నుంచి పోటీ చేస్తే అక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు జ‌న‌గామ‌కు వెళ్తార‌ని, జంప‌న్న‌కు ఇక్క‌డ అవ‌కాశం ఇస్తార‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

కేసీఆర్ మనసులో ఏముంది?

జంప‌న్న లొంగ‌బాటు అనంత‌రం మావోయిస్టుపార్టీ కేంద్ర‌క‌మిటీ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో జంప‌న్న‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసింది. కేంద్ర క‌మిటీ స‌భ్యుడిగా బాధ్య‌త‌ల నిర్వ‌హ‌ణ‌లో విఫ‌ల‌మ‌య్యాడ‌ని, త‌న వ్య‌క్తిగ‌త స్వార్థం కోసం పార్టీకి ద్రోహం చేశాడ‌ని ఆరోపించింది. ఈ నేప‌థ్యంలో మూడు ద‌శాబ్దాల‌కుపైగా విప్ల‌వ పార్టీలో కొన‌సాగిన జంప‌న్న‌పై పార్టీ చేసిన ఆరోప‌ణ‌ల‌తో ప్ర‌జ‌ల్లో సానుభూతి కొంత‌మేర‌కు త‌గ్గింది. దీంతో ఆయ‌న‌ను పార్టీలోకి ఆహ్వానించ‌డంపై నాయ‌కులు కూడా పున‌రాలోచ‌న‌లో ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ పార్టీలోకి తీసుకున్నా ఎలాంటి ప‌ద‌వులు ఇవ్వ‌కుండా కొంత‌కాలం వేచిచూసే ధోర‌ణి అవ‌లంబించే అవ‌కాశం ఉన్న‌ట్టు ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

Similar News