జంక్షన్న లో నువ్వా...? నేనా? అంటున్న ఎంపీ... ఎమ్మెల్యేల్లో ఎవరివైపు చంద్రబాబు మొగ్గుచూపుతారన్నది ఆసక్తిగా మారింది. వాస్తవానికి డెల్టా షుగర్స్ వ్యవహారంలో పార్లమెంటు సభ్యుడు గోకరాజు గంగరాజు వత్తిడి ఉందనేది కాదనలేని వాస్తవం. డెల్టా షుగర్స్ ను తణుకుకు తరలించడానికి గోకరాజు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. ఆయన ఆ సంస్థకు యజమాని కూడా.2001లో ప్రయివేటు పరమయిన డెల్టా షుగర్స్ ను తణుకును తరలించాలన్నది గోకరాజు గంగరాజు ఆలోచన. అయితే దీనిని ఎమ్మెల్యే వంశీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తన నియోజకవర్గంలోని రైతులకు అన్యాయం చేస్తున్నారన్నది గన్నవరం ఎమ్మెల్యే వంశీ వాదన. నాలుగేళ్లుగా మూసివేసి ఉంచిన ఈ సంస్థను తరలించే యత్నాన్ని వంశీ ఎప్పటికప్పుడు అడ్డుకుంటూనే ఉన్నారు. కాని ఇప్పుడు చివరి దశకు చేరుకుంది.
ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.....
డెల్టా షుగర్స్ స్థానిక రైతులతో అగ్రిమెంటు చేసుకుంది. దీంతో వేల ఎకరాల్లో రెండు లక్షల టన్నుల వరకూ చెరుకు పంటను సిద్ధంగా చేశారు రైతులు. ప్రస్తుతం వివాదం జరుగుతున్న నేపథ్యంలో రైతులు పండించిన చెరుకును ఉయ్యూరు చక్కెర ఫ్యాక్టరీ కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. డెల్టా యార్డు నుంచి తమ సొంత ఖర్చుతో చెరుకును తీసుకుంటామని భరోసా ఇచ్చింది. అయితే ఈ సంవత్సరం వరకూ బాగానే ఉంటుంది. తర్వాత పరిస్థితి ఏంటన్నది రైతుల ప్రశ్న. తాము పండించిన చెరకును ఎక్కడ అమ్ముకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. పరోక్షంగా డెల్టా ఫ్యాక్టరీపై ఆధారపడిన రైతులు, ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. డెల్టా షుగర్స్ ప్రయివేటు సంస్థ అయినా దాని సర్వ హక్కులు రైతులవేనన్నది వంశీ వాదన. 1973లో డెల్టా షుగర్స్ ప్రతిపాదన వచ్చినప్పుడు రైతుల నుంచి అప్పట్లో 85 లక్షలు వసూలు చేశారని చెబుతున్నారు. పదేళ్లకే ఈ సంస్థ ప్రారంభమైంది. అప్పట్లో దీన్ని హనుమాన్ జంక్షన్ కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీగా ప్రారంభించారన్న విషయాన్ని రైతులు గుర్తు చేస్తున్నారు. 2001లో డెల్టా షుగర్స్ గా మార్చారు. సంస్థను ప్రయివేటు పరం చసే ఉద్దేశంతోనే పేరు మార్పిడి జరిగిందంటున్నారు. అదే ఏడాది ఆ సంస్థను అమ్మేశారు. అప్పట్లో సంస్థ అమ్మకాన్ని రైతులు వ్యతిరేకించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుతం డెల్టా షుగర్స్ కింద ఐదు నుంచి పదివేల హెక్టార్ల భూమి సాగులో ఉంది. డెల్టా షుగర్స్ ను తిరిగి ప్రారంభించాలని వంశీ వాదిస్తుంటే... ఎంపీ గోకరాజు మాత్రం తణుకుకు తరలించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎంపీ గోకరాజు వైపు ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద ఈ డెల్టా ఫ్యాక్టరీ మిత్ర పక్షాల ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య చిచ్చుపెట్టిందనే చెప్పొచ్చు.