చిరంజీవి ఫుల్లు క్లారీటీతో ఉన్నట్లున్నారే?

Update: 2017-10-06 08:30 GMT

మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీని వీడాలని భావించడం లేదు. ఆయన ఆపార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. పీసీసీ సభ్యులను జిల్లాల వారీగా పార్టీ అధిష్టానం నియమిస్తుంది. అయితే చిరంజీవి తాను ఏరి కోరి పశ్చిమగోదావరి జిల్లాను ఎంచుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తనను పీసీసీ సభ్యుడిగా నియమించాలని చిరంజీవి స్వయంగా పార్టీ హైకమాండ్ ను కోరడంతో అందుకు అంగీకరించి పశ్చిమగోదావరిలోని కొవ్వూరు బ్లాక్ 1 పీసీసీ సభ్యుడిగా అధిష్టానం నియమించింది. ఈ నెల 10వ తేదీన పీసీసీ సభ్యులందరూ భేటీ అయి పీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. స్వయంగా పీసీీసీ సభ్యుడిగా తనను పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నియమించాలని చిరంజీవి కోరడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

వచ్చే ఎన్నికల్లో ఎలా?

చిరంజీవి సొంత ఊరు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు. ఆయన 2009 ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తిరుపతిలో మాత్రం విజయం సాధించారు. మరోవైపు వచ్చే ఎన్నికలకు తమ్ముడు పవన్ కల్యాణ్ సొంత పార్టీతో ప్రజల ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ కు ఏపీలో సీన్ లేదని తెలిసినా ఆ పార్టీలోనే కొనసాగాలని చిరంజీవి నిర్ణయించుకోవడం మెగా అభిమానుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు పవన్ కల్యాణ్ తనకు బలమున్న నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని చెబుతున్నారు. అందులోపశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కు , చిరంజీవికి అభిమానుల సంఖ్య ఎక్కువే. మరోవైపు కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకే చిరంజీవి ఆ పార్టీలో కొనసాగాలనుకుంటున్నారా? లేక తమ్ముడు పార్టీలోకి వెళ్లలేక ఇలా సెట్ అయ్యారా? అన్నది తెలియాల్సి ఉంది. ఇదే కనుక ఎన్నికల వరకూ కొనసాగితే అన్నదమ్ముల రెండు పార్టీల ప్రచారం అభిమానులను ఇబ్బందుల్లోకి నెడుతుందన్న దానిలో ఎటువంటి సందేహం లేదు.

Similar News