చిన్నమ్మకు ఇష్టం లేదట

Update: 2018-03-07 20:30 GMT

ఆ 70 రోజులు అపోలో ఆసుపత్రిలో ఏం జరిగిందో చెప్పటానికి శశికళ ఇష్టపడటం లేదా? అందుకోసమే జయ మృతిపై విచారణ చేస్తున్న ఏకసభ్య కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు నిరాకరిస్తున్నారా? అవుననే అనిపిస్తోంది. జయలలిత చనిపోయి ఏడాది పైగానే గడిచింది. జయ మృతిపై తమిళనాడులో అనేక అనుమానాలున్నాయి. జయ ఆసుపత్రికి వచ్చే ముందు ఇంట్లో ఏం జరిగింది? జయకు ఏ మందులు వాడారు? అపోలో ఆసుపత్రిలో జయకు ఎలాంటి చికిత్సలు చేశారు? అన్నదానిపై తమిళనాడు సర్కార్ ఏక సభ్య కమిషన్ ను నియమించిన సంగతి తెలిసిందే.

సమర్పించని ప్రమాణ పత్రం....

అయితే ఏకసభ్య కమిషన్ జస్టిస్ ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఏర్పాటయింది. ఈ కమిషన్ అనేకమందిని ఇప్పటికే విచారణ చేసింది. అయితే ఈ కేసులో శశికళను విచారించడం కీలకం. ఎందుకంటే జయ వెన్నంటే కొన్నేళ్లుగా ఉంటున్న శశికళ ఆసుపత్రిలోనూ ఎవరినీ దగ్గరకు రానివ్వలేదన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో కమిషన్ శశికళకు సమన్లు పంపింది. గత ఏడాది సమన్లు పంపినప్పటికీ ఇప్పటి వరకూ శశికళ తన ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయలేదు. ఇప్పటికి ఐదు సార్లు గడువు పొడిగించినప్పటికీ మరోసారి మరికొంత సమయం కావాలని శశికళ కోరడంపై కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

కమిషన్ సీరియస్.....

తనకు ప్రమాణ పత్రం సమర్పించడానికి మరికొంత గడువు కావాలని శశికళ పెట్టుకున్న పిటీషన్ ను కమిషన్ తిరస్కరించింది. కమిషన్ తో శశికళ ఆటలాడుకుంటున్నారని వ్యాఖ్యానించింది. శశికళ ప్రమాణపత్రం దాఖలు చేయకుంటే కమిషన్ స్వయంగా జైలుకు వచ్చి వాంగ్మూలం నమోదు చేస్తామని కూడా చెప్పారు. లేకుంటే శశికళపై ఈ కేసులో ప్రతికూల అభిప్రాయానికి రావాల్సి ఉంటుందని కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి చూస్తే జయలలితకు చికిత్స విషయంలో ఏం జరిగిందో శశికళకు చెప్పడం ఇష్టంలేదని అర్థమవుతుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అయితే కమిషన్ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో మరో రెండు, మూడు రోజుల్లో ప్రమాణ పత్రం దాఖలు చేస్తారని ఆమె న్యాయవాది న్యాయస్థానానికి వివరించారు.

Similar News