పరప్పణ అగ్రహార జైలులో శశికళ మళ్లీ దొరికిపోయారు. ఆమెకు వీవీఐపీ ట్రీట్ మెంట్ జైలులో అందుతున్నాయని ఇటీవల సంచలన ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం కూడా విచారణ కమిటీని నియమించింది. విచారణ కమిటీ కూడా తన విచారణను ప్రారంభించింది. శశికళకు జైలులో ప్రత్యేక గది, దుస్తులతో పాటు ఆమెకు ప్రత్యేకంగా వంట మనిషిని కూడా ఇచ్చారని డీఐజీ రూప ఆరోపించారు. దీనిపై కొందరు జైలు సిబ్బందిని కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
జైలు నిబంధనలు కాదని.....
అయితే తాజాగా మళ్లీ అటువంటి ఆరోపణలే వచ్చాయి. అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళ, ఆమె వదిన ఇళవరసి ఇప్పటికీ సాధారణ దుస్తులను మాత్రమే ధరిస్తున్నారన్న విషయం మరోసారి బయటపడింది. జైలు నిబంధనల ప్రకారం శశికళ, ఇళవరసి, సుధాకరన్ లు ప్రత్యేక దుస్తులు మాత్రమే ధరించాల్సి ఉంటుంది. అందరు ఖైదీలు ఈ నియమాన్ని పాటించాలి. సాధారణ ఖైదీలు తీసుకునే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంది.
తాజాగా మళ్లీ.....
అయితే ఇటీవల పరప్పణ అగ్రహార జైలును జాతీయ మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ రేఖాశర్మ సందర్శించారు. అయితే ఆమె జైలును సందర్శించినప్పుడు శశికళకు ప్రత్యేక ట్రీట్ మెంట్ కొనసాగుతుందని ఆమె గుర్తించారు. తాను జైలును సందర్శించినప్పుడు శశికళ జైలు యూనిఫాం ధరించలేదని, సాధారణ దుస్తులు ధరించడం చూశానని రేఖాశర్మ తెలిపారు. ఇళవరసి కూడా సాధారణ దుస్తుల్లోనే ఉండటం తాను చూశానంటున్నారు. మొత్తం మీద శశికళకు జైలులో స్పెషల్ ట్రీట్ మెంట్ జరుగుతుందని మరోసారి రుజువైంది.