ఒక పక్క వెంటాడుతున్న సిబిఐ, ఐటి దాడులు, మరో పక్క ఈడీ, ఇంకో పక్క నరకప్రాయంగా జైలు జీవితం ఇవి తమిళ రాజకీయాలను తెరవెనుక శాసించిన చిన్నమ్మ శశికళ కష్టాలు. జయ సమాధి సాక్షిగా ప్రత్యర్థుల అంతు చూస్తా అంటూ శశికళ చేసిన మంగమ్మ శపథం కాలం ఇచ్చిన తీర్పులో కేంద్రం వేసిన ఎత్తులో చిత్తయిపోయింది. ఎటు చూసినా బిగుస్తున్న ఉచ్చులతో ఇప్పట్లో చిన్నమ్మ బయట పడటం కష్టమనే సంకేతాలే పంపుతున్నాయి. దాంతో చిన్నమ్మ అనుంగ దూతలు ఢిల్లీ లో ఆమె ను రక్షించాలనే ప్రయత్నాలను కమలనాధుల దగ్గర మొదలు పెట్టారని టాక్. డబ్బు పోయింది, పదవి పోయింది, కనీసం జైలు జీవితం నుంచైనా విముక్తి లభిస్తే చాలన్న కాంప్రమైజ్ కి చిన్నమ్మ దిగిపోయారని అంటున్నారు.
లెక్కలు తేలుస్తున్నారు ....
ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో శశికళ పీకల్లోతు దిగేలా ఐటి శాఖ సర్వ అస్త్రాలను ప్రయోగిస్తోంది. శశి బంధు గణంపై తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, ఆంద్ర ప్రాంతాల్లో ఆదాయపు పన్నుశాఖ నిరంతరాయంగా దాడులు చేస్తూనే సాగుతుంది. కోట్లాది రూపాయల డబ్బు, బంగారం, స్థిరాస్తి పత్రాలు తవ్వే కొద్ది బయటపడటంతో పాటు విదేశాల్లోని దుబాయి, మారిషస్ లో పెట్టిన పెట్టుబడులు బినామీ కంపెనీలు అనేకం వెలుగు చూస్తూనే వున్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటిగా చిన్నమ్మ మెడకు చుట్టుకుంటున్నాయి. జయ , శశి హయాంలో సర్వభోగభాగ్యాలు అనుభవించిన చిన్నమ్మ బంధు గణం ఇప్పుడు జయలలితను తీవ్ర శాపనార్ధాలు పెడుతున్నారట. జయ కు అధికారంలో ఉంచడానికి శశి తన జీవితం ధారపోశారని ఆమె చనిపోయి కష్టాలు తమ నెత్తిన పెట్టారని నెత్తి నోరు కొట్టుకుంటున్నారట వారు.