తమిళనాడులో మరో కొత్త పార్టీ పురుడుపోసుకోనుంది. కమల్ హాసన్, రజనీకాంత్ పార్టీల కంటే ముందుగానే శశికళ పార్టీ కొత్తగా తమిళనాడులో తెరపైకి రానుంది. ఇటీవల ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో గెలిచిన దినకరన్ కొత్త పార్టీని పెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు పాండిచ్చేరిలో తన అనుచరులతో సమావేశమైన దినకరన్ శశికళ జైలు నుంచి బయటకు వచ్చే ముందే కొత్త పార్టీని పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆర్కే నగర్ ఉప ఎన్నిక అందించిన విజయంతో ఆయన ఉత్సాహంగా కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. జయలలిత పేరుమీదనే కొత్త పార్టీ పేరు ఉండే అవకాశం ఉంది.
పార్టీ, గుర్తు చేజారడంతో.....
శశికళ జైలుకు వెళ్లేంత వరకూ అన్నాడీఎంకే పార్టీ మన్నార్ గుడి మాఫియా చేతుల్లోనే ఉంది. అయితే తదనంతర పరిణామాల నేపథ్యంలో శశికళ కుటుంబ సభ్యులను పార్టీ నుంచి బయటకు పంపించేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు కలిసి పోవడంతో పార్టీ మొత్తం వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. అలాగే ఎన్నికల కమిషన్ కూడా పార్టీ గుర్తును, పేరును కూడా పళని, పన్నీర్ వర్గాలకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో దినకరన్ స్వతంత్ర అభ్యర్థిగా ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చింది. అయినా కూడా దినకరన్ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో శశికళ బ్యాచ్ లో ఆశలు చిగురించాయి.
త్వరలో కొత్త పార్టీ ప్రకటన.....
జయలలిత బతికున్నంత వరకూ ఆమెకు సేవలు చేస్తూ గడిపిన శశికళ, ఆమె మరణానంతరం దాదాపు ఒంటరయి పోయారు. కుటుంబ సభ్యులతో పాటు కొద్దిపాటి క్యాడర్ మాత్రమే ఆయన వెన్నంటి నిలిచింది. అయితే జయలలిత వారసత్వాన్ని చేపట్టాలని శశికళ ఉవ్విళ్లూరుతున్నారు. ఈ మేరకు దినకరన్ కు చిన్నమ్మ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. జయ అభిమానులతో పాటు తన అనుచరులు పట్టు జారిపోకుండా ఉండేందుకు కొత్త పార్టీ నిర్ణయం తీసుకున్నారు. రేపు ఎంజీఆర్ జయంతి సందర్భంగా దినకరన్ కొత్త పార్టీని ప్రకటించే అవకాశముంది. అయితే ఇప్పుడే కాదని, అన్నాడీఎంకే నేతలకు కొంత సమయం ఇచ్చిన తర్వాత ప్రకటించాలని దినకరన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దినకరన్ పార్టీ ప్రకటన చేయడం వెనక చిన్నమ్మ ఉన్నారు. ఆమె జైలు నుంచి వచ్చేలోగా కొత్త పార్టీని పటిష్టం చేయాలన్నది వ్యూహంగా కన్పిస్తోంది. అయితే దినకరన్ మాత్రం అన్నాడీఎంకే కు వార్నింగ్ ఇచ్చారు. రెండు నెలల సమయం ఇస్తున్నానని, ఈలోగా చేసిన తప్పులు సరిదిద్దుకుంటే సరి...లేకుంటే ప్రభుత్వాన్ని కూల్చవేస్తానని దినకరన్ హెచ్చరించారు. కొత్త పార్టీని త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు.