తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నెచ్చెలి శశికళ జైలుకు వెళ్లి సరిగ్గా ఏడాది గడుస్తోంది. జయలలిత మరణానంతరం అక్రమాస్తుల కేసులో శశికళ పరప్పణ అగ్రహారం జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆమె జైలు జీవితం ఏడాది పూర్తి చేసుకుంది. ఈ ఏడాదిలో తమిళనాడులో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. జయలలిత తర్వాత తానే ముఖ్యమంత్రి కావాలని కలలు కన్న చిన్నమ్మకు పాత కేసులో చిక్కుకుని విలవిలలాడారు. ఇటు ముఖ్యమంత్రి పదవి రాక, అటు పార్టీ కూడా చేజారిపోయిన చిన్నమ్మ గత ఏడాది ఫిబ్రవరి పదిహేనో తేదీన ఆమెను బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలుకు తరలించారు.
నమ్మకస్థుడని భావిస్తే.....
తనకు అత్యంత నమ్మకస్తుడిగా పేరుపొందిన పళనిస్వామిని చివరకు ముఖ్మమంత్రిని చేశారు చిన్నమ్మ. అన్నాడీఎంకే నేత, మాజీ ముఖ్యమంత్రి, జయలలితకు అత్యంత విధేయుడైన పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేయడంతో ఆమె పళనివైపు మొగ్గు చూపారు. జైలుకు వెళుతూ కూడా శశికళ జయ సమాధి వద్ద శపథాలు చేసి మరీ వెళ్లారు. కాని జైలులో ఉన్న శశికళను ఆమె కుటుంబ సభ్యులు తప్ప పట్టించుకునే వారే లేరు. ఇక జైలులో శశికళ శిక్ష అనుభవిస్తూనే బెయిల్ కోసం లంచం ఇవ్వచూపారన్న ఆరోపణలు కూడా ఈ ఏడాది కాలంలోనే ఎదుర్కొన్నారు. జైలు నుంచి బయటకు వెళుతూ విలాసవంతమైన జీవితం గడుపుతున్న ఆమె ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో కర్ణాటక సర్కార్ విచారణకు కూడా ఆదేశించింది.
అంతా ప్రతికూలమే....
ఇక చిన్నమ్మ జైలుకు వెళ్లిన తర్వాత పరిస్థితులన్నీ ఆమెకు ప్రతికూలంగా మారిపోయాయి. ముఖ్యమంత్రిగా తాను పదవిలో కూర్చోబెట్టిన పళనిస్వామి ఎదురుతిరిగారు. తనకు ప్రధాన శత్రువైన పన్నీర్ సెల్వంతో చేతులు కలిపారు. మరోవైపు అన్నాడీఎంకే నుంచి శశికళ కుటుంబ సభ్యులను తొలగించారు. శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ చక్రం తిప్పుతాడనుకుంటే మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టారు. అయితే ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ విజయం సాధించడం కొంత ఊరట నిచ్చే విషయం. శశికళ భర్తనటరాజన్ అస్వస్థతకు గురికావడంతో ఆమె ఐదురోజుల పాటు పెరోల్ పై బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ ముఖ్య నేతలతో జరిపిన చర్చలు కూడా సఫలం కాలేదనే చెప్పాలి. నాలుగేళ్ల జైలు శిక్షలో ఏడాది పూర్తయింది. మరో మూడేళ్లు జైలు జీవితం గడపాల్సి ఉంది.