చారిత్రాత్మక ఆటలో కూలిన పేకమేడ!

Update: 2016-09-22 12:27 GMT

భారత క్రికెట్‌ జట్టు ప్రతిభా పాటవాలు అనేవి వ్యక్తుల రూపంలో ఉన్నాయా? జట్టు రూపంలో ఉన్నాయా? అనేది చరిత్రకు అందని కాలంనుంచి చిక్కుముడి ప్రశ్నే. అయితే ప్రస్తుతం భారత క్రికెట్‌ చరిత్రలో చిరస్మరణీయమైన 500 వ మ్యాచ్‌ ఆడుతున్న భారత్‌ జట్టు లోని డొల్లతనం తొలిరోజే బయటపడింది. జట్టుగా తొలిరోజే.. ప్రత్యర్థి ఆటపై పట్టు బిగించడానికి వీరు అవకాశం కల్పించారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 291 పరుగుల స్కోరు మరీ తక్కువేం కాదు గానీ.. అప్పటికి 9 వికెట్లు కుప్పకూలిపోవడమే బయటపడ్డ మన బలహీనత.

భారత పర్యటనలో ఉన్న న్యూజీలాండ్‌ జట్టుతో భారత్‌ తొలి టెస్ట్‌ మ్యాచ్‌ గురువారం కాన్పూర్‌ లో ప్రారంభం అయింది. టాస్‌ గెలిచిన కొహ్లి తమ జట్టు బలం అనుకుని బ్యాటింగ్‌ నే ఎంచుకున్నాడు. కానీ.. పది ఓవర్లు గడిచేసరికెల్లా తొలిదెబ్బ పడింది. ఓపెనర్‌ విజయ్‌ 65, పుజారా 62 పరుగులతో గౌరవప్రదంగానే స్కోరు చేసినా.. కొహ్లి కేవలం 9 పరుగులకే పెవిలియన్‌ చేరడం.. మన జట్టుకు పెద్ద దెబ్బ. అశ్విన్‌ ను మినహాయిస్తే బౌలర్లు ఎవరూ క్రీజులో నిలబడలేకపోవడం వైఫల్యం. మొత్తానికి 90 ఓవర్లలో తొలిరోజు 291 పరుగులు మాత్రమే భారత్‌ చేయగలిగింది.

న్యూజిలాండ్‌ జట్టులో బౌల్ట్‌, శాంట్నర్‌ లు మూడేసి వికెట్లు తీశారు. వాగ్నర్‌, క్రెగ్‌, సోధి లకు ఒక్కొక్క వికెట్‌ దక్కాయి. అయితే ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో భారత్‌ అభిమానులకు ఎలాంటి ఫలితాన్ని కానుకగా అందిస్తుందనేది రెండోరోజు మన బౌలర్లు ప్రదర్శించగల ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది.

Similar News