చల్లా ఎటు చేయివేస్తారో...?

Update: 2017-12-27 07:30 GMT

ఒక నిర్ణయంతో ఒక సామాజిక వర్గం దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయా? ఒక సీటు వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లకు ఎర్త్ పెట్టేనుంది. ఇదే ఇప్పుడు సీమ జిల్లాలోని తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని అనేకమంది నేతలు తప్పుపడుతున్నారు. కర్నూలు ఎమ్మెల్సీ స్థానానికి కేఈ ప్రభాకర్ ఎంపిక చేయడంపై అసంతృప్తితో నేతలు లోలోపల రగిలిపోతున్నారు. కేఈ కుటుంబానికి తప్ప ఇంకెవరికీ పదవులివ్వరా? అన్న ప్రశ్నను కొందరు సూటిగానే ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని కొందరు రెడ్డి సామాజిక వర్గ నేతలు కర్నూలుజిల్లా ఇన్ ఛార్జి మంత్రి కాల్వ శ్రీనివాసులు ఎదుట కుండబద్దలు కొట్టేశారు.

ఎమ్మెల్సీ కోసం తీవ్రంగా ప్రయత్నించి...

ముఖ్యంగా చల్లా రామకృష్ణారెడ్డి, శివానందరెడ్డిలు ఈ ఎమ్మెల్సీ కోసం తీవ్రంగానే ప్రయత్నించారు. ఇప్పటి వరకూ రెడ్డి సామాజిక వర్గానికిచెందిన వారికే ఈ సీటును కేటాయిస్తున్నప్పుడు ఉన్నట్లుండి పార్లమెంటు నియోజకవర్గ పరిధిని ఎందుకు తీసుకువచ్చారన్న ప్రశ్న తలెత్తుతోంది. చంద్రబాబు అందరికీ ఏదో ఒకరూపంలో పదవులు ఇస్తామని చెప్పినప్పటికీ, ఎమ్మెల్సీ పదవికి మించిందేముంటుందని వీరు బాహాటంగానే పార్టీ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు.

గతంలో హామీ ఇచ్చి....

గత ఎన్నికల్లో బనగానపల్లె నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బీసీ జనార్థన్ రెడ్డి పోటీచేశారు. పార్టీలో చేరిన చల్లా రామకృష్ణారెడ్డికి అప్పట్లోనే చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. చల్లా రామకృష్ణారెడ్డి బనగానపల్లె నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అయినా... బీసీ జనార్థన్ రెడ్డి గెలుపుకోసం తీవ్రంగా కృషి చేశారు. ఒకరకంగా చెప్పాలంటే చల్లా చేయి వేయకుంటే.. బీసీ జనార్థన్ రెడ్డి గెలుపు అంత సులువయ్యేది కాదు. కాని ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి దక్కక పోవడంతో చల్లా రగిలిపోతున్నారు. తనకు ఏమీ పదవలొద్దని, వచ్చే ఎన్నికల్లో బనగానపల్లె టిడిపి టిక్కెట్ ఇవ్వాలన్న సంకేతాలు అధినేతకు పంపారు. లేకుంటే తన దారి తాను చూసుకోగలనని కూడా చెప్పేశారు.

శివాలెత్తుతున్న శివానందరెడ్డి...

ఇక నందికొట్కూరు నియోజకవర్గం ఇన్ ఛార్జిగా ఉన్న శివానందరెడ్డిదీ అదేపరిస్థితి. శివానందరెడ్డికి గతంలోనే మాట ఇచ్చిన చంద్రబాబు ఈసారి కూడా తప్పడంతో ఆయన కొంత అసహనానికి లోనయ్యారు. ఎమ్మెల్యే కోటాలోనే తనకు ఎమ్మెల్సీ వస్తుందని ఆశించిన శివానందరెడ్డి చివరకు స్థానికసంస్థల ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వకపోవడంతో పూర్తిగా నిరాశకు లోనయ్యారు. కేఈ ప్రభాకర్ ను అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత శివానందరెడ్డి పార్టీ నేతలెవ్వరికీ అందుబాటులో లేకుండా పోయారు. కేఈ ప్రభాకర్ ను అభ్యర్థిగా నిర్ణయించడంతో సీమ జిల్లాల్లో ప్రధాన సామాజిక వర్గమైన రెడ్లలో పూర్తి అసంతృప్తి నెలకొందన్న వార్తలు వస్తున్నాయి. అయితే తెలుగుదేశం పెద్దలు దీనిని పైకి కొట్టిపారేస్తున్నా... లోపల మాత్రం వచ్చే ఎన్నికల్లో అసంతృప్త నేతలు వెన్నుపోట్లు పొడుస్తారన్న భయం మాత్రం వారిలో ఉందన్నది వాస్తవం. మొత్తం మీద కేఈ ప్రభాకర్ ను ఎమ్మెల్సీ చేయడంతో సీమ జిల్లాలో టీడీపీ ఒక సామాజిక వర్గం ఓట్లకు తనకు తానే గండి కొట్టుకుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Similar News