చంద్రబాబు క‌ష్టాలు ఇంతింత‌కాద‌యా..!

Update: 2017-12-23 12:30 GMT

2019 ఎన్నిక‌ల్లో గెలిచి అధికారాన్ని నిల‌బెట్టుకోవాల‌ని సీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టినుంచే ప్ర‌ణాళిక‌లు మొద‌లుపెట్టేశారు. కూడిక‌లు, తీసివేత‌లు అంటూ లెక్క‌లు కూడా వేస్తున్నారు. ఇప్ప‌టికే ఆప‌రేష‌న్ ఆకర్ష్ ద్వారా చాలా మంది ఎమ్మెల్యేలు, ఇత‌ర నేత‌ల‌ను సైకిలెక్కించేసుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇస్తామ‌నే హామీతోనే వీరిని పార్టీలో చేర్పించేసుకున్నారు. వీరితో పాటు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇన్‌ఛార్జులు కూడా సీటు కోసం వేచిచూస్తున్నారు. ఇంకోప‌క్క మిత్ర ధ‌ర్మం పాటిస్తే.. బీజేపీకి కూడా సీట్లు కేటాయించాలి. మ‌రి ఈ లెక్క‌ల‌న్నీ వేసుకుంటే.. ఉన్న 175 నియోజక‌వ‌ర్గాల్లో తీవ్ర పోటీ త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఇప్పుడున్న త‌ల‌నొప్పులకు తోడు ఇప్పుడు కొంత‌మంది ఎంపీలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని నిర్ణ‌యించ‌డంతో ఇప్పుడు బాబుకు మ‌రిన్ని క‌ష్టాలు త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు.

చిక్కులు తప్పేలా లేవు...

విభ‌జ‌న తర్వాత అటు ఏపీలోనూ ఇటు తెలంగాణ‌లోనూ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు పెరుగుతాయ‌నే చర్చ జోరుగా జ‌రిగింది. కేంద్రంపై భ‌రోసాతో విప‌క్ష నేత‌ల‌ను ఎడాపెడా చేర్పించేసుకున్నారు సీఎంలు! తెలంగాణ సంగ‌తి అటుంచితే ఇటు ఏపీలో ఇప్పుడు సీఎం చంద్ర‌బాబుకు స‌రికొత్త టెన్ష‌న్ ప‌ట్టుకుంది. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో 175 అసెంబ్లీ సీట్లను 225కు చేయించొచ్చని.. పార్టీలో సిట్టింగులతో పాటు ఆశావహులందరికీ ఛాన్సివ్వొచ్చని, ఇంకా, విపక్షం నుంచి వచ్చిన ఫిరాయింపు బ్యాచునూ ఇందులో సర్దేయొచ్చని చంద్రబాబు ఎన్నో కలలు గన్నారు. కానీ, కేంద్రం ఆయనకు ఈ విషయంలో చేతులెత్తేయ‌డంతో ఇప్పుడు చిక్కులు త‌ప్పేలా కనిపించ‌డం లేదు.

ఎంపీలు అసెంబ్లీకి...

ఉన్న 175 సీట్లలోనే పాతవారు, కొత్తవారు అందరినీ సర్దుబాటు చేయాలి. ఎన్నికల సమయంలో టిక్కెట్లు పంచేటప్ప టికి చంద్రబాబుకు చుక్కలు కనిపించడం ఖాయమ‌ని ఇప్ప‌టికే విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇది చాలదన్నట్లుగా చంద్రబాబుకు కొత్త కష్టం వచ్చిందంటున్నారు. ఎంపీల్లో చాలామంది అసెంబ్లీకి పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారట. చంద్రబాబు వద్ద ఇప్పటికే దీనిపై అప్లికేషన్ పెట్టుకున్నారట. ఇలా అసెంబ్లీపై కన్నేసిన వారిలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, హిందూపురం ఎంపీ నిమ్మ‌ల కిష్ట‌ప్ప, ఏలూరు ఎంపీ మాగంటి బాబు, కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు, చిత్తూరు ఎంపీ శివ ప్రసాద్ తో పాటు మరికొంద‌రు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇలా అయితే ఎలా?

గ‌ల్లా జ‌య‌దేవ్ చిత్తూరులోని సొంత నియోజ‌క‌వ‌ర్గం చంద్ర‌గిరి నుంచి, నిమ్మ‌ల కిష్ట‌ప్ప పెనుగొండ, పుట్ట‌ప‌ర్తి స్థానాల్లో ఏదో ఒకటి కేటాయించాలని కోరుతున్నారట. ఇక అశోక్ కూడా విజయ‌న‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయన పోటీకి ఇష్టపడుతుండగా, మాగంటి బాబు కైక‌లూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారట. వీరిలో ఒక్క అశోక్ కు మాత్రమే అసెంబ్లీ టిక్కెట్ దక్కుతుందని అంతా భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి యనమలను రాజ్యసభకు పంపడం ఖాయమని టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో 2019లోనూ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే అప్పుడు అశోక్ ను ఆప‌దవిలో కూర్చోబెట్టాల‌నేది బాబు ఆలోచనట‌.

Similar News