ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్దారు. జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నివేదికను జనసేనాని ప్రజల ముందుంచారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నియమించిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నివేదిక రూపొందించింది. ఈ నివేదికలో కేంద్రమే 90 శాతం నిధులను భరించాలని పేర్కొంది. ప్రత్యేక హోదా లేదని చెప్పి ప్యాకేజీ ప్రకటించారని, ప్యాకేజీకి సంబంధించి కూడా నిధులు కూడా పూర్తిగా ఇవ్వలేదన్నారు. విభజనలో రాజకీయ నేతల పాత్ర ఉంది కాని ప్రజల పాత్రలేదన్నారు. ప్రజలను కదిలించారు కాని స్థిరాస్థి ఇక్కడే ఉండిపోయిందన్నారు.
11 అంశాలను గుర్తించింది....
మొత్తం 11 అంశాలను ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ గుర్తించిందన్నారు. పదో షెడ్యూల్ లో పొందుపర్చిన అంశాలను కేంద్రం పరిష్కరించాలని కోరారు. తనను బీజేపీ పార్ట్ నర్ అని కొందరు, టీడీపీ భాగస్వామినని మరికొందరు తనపై విమర్శలు చేశారని, అందుకోసమే నిజాలు నిగ్గుతేల్చేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేశానన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేసిందని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అభిప్రాయపడింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులోనే అన్నీ చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. స్పెషల్ స్టేటస్ ఎందుకివ్వరని, అది ఇచ్చేందుకు ఉన్న అభ్యంతరాలేమిటో ప్రజలకు చెప్పాలన్నారు.
నాలుగేళ్లు ఎందుకు మౌనం....
ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రత్యేక హోదా విషయంలో పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేశారని, దీనివల్ల ప్రజల్లో అయోమయం నెలకొందన్నారు. నాలుగేళ్లు రాష్ట్ర ప్రభుత్వం ఎందుక మౌనంగా ఉందన్నారు. ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలని ఎద్దేవా చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వడమే కాకుండా వెంటవెంటనే నిధులను విడుదల చేయాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు యుటిలిటీ సర్టిఫికేట్లు పంపించాలన్నారు. పనులు సక్రమంగా జరిగే బాధ్యతను కేంద్రం తీసుకోవాలన్నారు. విశాఖ రైల్వే జోన్ ను ఇవ్వాల్సిందేనన్నారు. రామ్ విలాస్ పాశ్వాన్ సొంత ప్రాంతానికి రైల్వే జోన్ ఇచ్చి...విభజన హామీల్లో ఉన్న విశాఖ రైల్వే జోన్ ను ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు.
ఎందుకు భయపడాలి?
రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఎందుకు భయపడుతుందన్నారు. దుగరాజపట్నానికి సమస్యలు వస్తే వేరే ప్రాంతాన్ని ఎందుకుసూచించలేదన్నారు. ఈవిషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. విజయవాడ, విశాఖ మెట్రో రైలుకు సంబంధించి విభజన చట్టంలో ఉన్నా ఎందుకు రావడం లేదన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కలిసి ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు. దేనిమీద మీకు గొడవలున్నాయో మాకు అర్థం కావడం లేదన్నారు. టీడీపీ, బీజేపీ ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు. మొత్తం మీద పవన్ కల్యాణ్ నియమించిన జేఎఫ్ సి కమిటీ కేంద్రం నుంచి నిధులు ఎక్కువగా రావాల్సి ఉందని అభిప్రాయపడింది. కేంద్రం ఇచ్చిన లెక్కలకు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చూపాల్సి ఉంటుందన్నారు. కేంద్రం నుంచి ఇప్పటి వరకూ 75 వేల కోట్లు రావాల్సి ఉందని గుర్తించామన్నారు. చట్టాన్ని సరిగా రూపొందించకపోవడం వల్లనే ఏపీకి అన్యాయం జరిగిందన్నారు.