చంద్రబాబుపై ముప్పేట దాడి...!

Update: 2017-12-02 04:30 GMT

పోలవరం ప్రాజెక్ట్ అంశం చంద్రబాబు సర్కార్ ను ఇంటా బయట ఊపిరి సలపనీయకుండా చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇలాగే సహాయనిరాకరణ చేస్తే దీనికో దణ్ణం పెడతా అంటూ బాబు చేతులు ఎత్తేయడంపై బిజెపి సహా అన్ని పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి. టిడిపి సర్కార్ చేసే తప్పులను కేంద్రంపై నెట్టాలని చూస్తున్నారని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్యెల్సీ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిలో పనిగా జెసి దివాకర రెడ్డి బిజెపి పై చేసిన వ్యాఖ్యలకు సోము ధీటుగా స్పందించారు ఆయనో పొలిటికర్ బ్రోకర్ అంటూ ఘాటైన పదజాలం ప్రయోగించారు.

బాబుపై చెలరేగిన జగన్ ...

ప్రజాసంకల్ప పాదయాత్రలో వున్న విపక్ష నేత వైఎస్ జగన్ మరింత తీవ్ర స్థాయిలో తన సహజ శైలిలో విమర్శల వర్షం కురిపించారు. టెండర్లను తన తాబేదార్లకు కట్టబెట్టాలని బాబు చేసిన ప్రయత్నం కేంద్రం గుర్తించిందని అందుకే నిబంధనలకు విరుద్ధమైన టెండర్లు నిలుపుచేయాలని కోరిందని అన్నారు. కేంద్ర అధికారులు చంద్రబాబు సర్కార్ కి ఇచ్చిన లేఖను జగన్ ప్రజలకు వివరించారు. గ్లోబల్ టెండర్లు పిలవాలిసి ఉండగా, 45 రోజుల గడువు ఇచ్చి ఎక్కువమంది టెండర్లలో పాల్గొనేలా చేయాలిసి ఉండగా చంద్రబాబు అవేమి పాటించలేదన్నారు. 20 రోజుల సమయం మాత్రమే ఇచ్చి తన మనుషులకే కాంట్రాక్ట్ దక్కేలా పావులు కదపడమే ఈ పరువు తక్కువ పనికి సాక్ష్యమన్నారు.

కేంద్రం బాబును బ్లాక్ మెయిల్ చేస్తుందన్న సిపిఐ....

ఎవడబ్బ సొత్తు అని మోడీ, బాబు వ్యవహారం నడుపుతున్నారు. పోలవరం రాష్ట్ర ప్రజల సొత్తు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు సిపిఐ జాతీయ నేత నారాయణ. 62 సార్లు కేంద్రం చుట్టూ తిరిగానని సిగ్గు విడిచి చంద్రబాబు చెప్పారని అయినా పని కాలేదంటే ఆయన చప్రాసీ ముఖ్యమంత్రా అంటూ ఘాటు వ్యాఖ్యలే చేశారు నారాయణ. టిడిపి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేంద్రం వేసిన పన్నాగం అంటూ విమర్శించారు.

కమీషన్లలో పేచీనేనన్న కాంగ్రెస్ ...

పోలవరం ప్రాజెక్ట్ లో కమిషన్ల కోసం బిజెపి, టిడిపి లనడుమ యుద్హం మొదలైందని ఆరోపించారు ఏపీ పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి. 16 వేలకోట్ల రూపాయల ప్రాజెక్ట్ వ్యయాన్ని పెంచుతూ పోయి 58 వేలకోట్ల రూపాయలుగా చంద్రబాబు చేశారని దుయ్యబట్టారు రఘువీరా. ఇలా ఎవరు బడితే వారు పోలవరం పై చంద్రబాబు వైఖరిని తూర్పారబెట్టారు.

Similar News