వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప యాత్ర కు ఒక రోజు విరామం ఇచ్చారు. క్రిస్మస్ పర్వదినం రోజున జగన్ పాదయాత్రకు విరామం ప్రకటించారు. తిరిగి మంగళవారం పాదయాత్ర ప్రారంభంకానుంది. . ప్రస్తుతం కదిరి నియోజకవర్గంలో జగన్ పర్యటిస్తున్నారు. తిరిగి గాండ్ల పేట నుంచి జగన్ పాదయాత్ర మంగళవారం నుంచి జరుగుతుంది. ఇప్పటి వరకూ జగన్ 600కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఇప్పటి వరకూ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో పర్యటించిన జగన్ మంగళవారం ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో ప్రవేశించనున్నారు. మంగళవారం సాయంత్రానికి ఆయన అనంతపురం జిల్లాలో పాదయాత్ర ముగించుకుని చిత్తూరు జిల్లాలోకి చేరుకుంటారు. సీఎం సొంత జిల్లా కావడంతో అక్కడ పాదయాత్రను విజయవంతం చేయడానికి వైసీపీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో కూడా జగన్ పాదయాత్ర దాదాపు 250కిలోమీటర్లు సాగనుంది. ఎనిమిది నియోజకవర్గాల్లో పర్యటించనుంది.
వైసీపీలో చేరుతున్న నేతలు...
బహిరంగసభలకు పెద్దయెత్తున జనం తరలి వస్తుండటంతో నూతనోత్సాహంతో జగన్ ముందుకు వెళుతున్నారు. అంతేకాకుండా జగన్ కు మద్దతు తెలుపుతూ కొందరు నేతలు పార్టీలో చేరడం కూడా శుభపరిణామమే. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, బీసీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటేశ్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. బీసీలకు చంద్రబాబు మోసం చేస్తున్నారని, ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రచారం చేస్తానని ఆయన చెప్పారు.