ఒక పక్క ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలూ ఉద్యమిస్తుంటే చంద్రబాబు అదే సీన్ ను రిపీట్ చేయదలచుకున్నారు. మార్చి 5వ తేదీన జరిగే పార్లమెంటు సమావేశాల్లోనూ సభాకార్యక్రమాలను స్థంభింప చేయాలని నిర్ణయించుకున్నారు. రాజీనామాలు, అవిశ్వాసం అనేది అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే కేంద్ర ప్రభుత్వంలో నుంచి బయటకు రావాలా? వద్దా? అన్నది మార్చి 5వ తేదీ తర్వాత నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష వైసీపీ కేవలం ప్రత్యేక హోదాను పట్టుకునే పాకులాడుతుందని, మొత్తం 19 అంశాలపై కే్ంద్రం నుంచి స్పష్టత రావాల్సి ఉందని చంద్రబాబు చెప్పారు.
ప్రత్యేక హోదా కోసం.....
మార్చి 5వ తేదీ నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లోపు కేంద్రం నుంచి ఒక స్పష్టత వచ్చే అవకాశముందని కూడా చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కేంద్రంలో కొంత కదలిక తీసుకురాగలిగామని, మరికొంత వత్తిడి తెస్తే విభజన హామీలను అమలు చేయించుకోవడం పెద్ద కష్టమేదీ కాదని ఆయన అన్నారు. దీంతో పాటుగా తొలుత విశాఖ రైల్వేజోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ, దుగరాజు పట్నం పోర్గు వంటి వాటిని పార్లమెంటులో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదా 11 రాష్ట్రాలకు పొడిగించినందున ఏపీకి కూడా హోదా ఇవ్వాలని గట్టిగా కోరాలన్నారు.
కేంద్రం నుంచి బయటకు రావాలంటే....
మరోవైపు కేంద్రంతో నిరంతరం చర్చలు జరపాలని కూడా చంద్రబాబు ఎంపీలను ఆదేశించినట్లు తెలిసింది. హామీల రూపంలో కాకుండా ఉత్తర్వుల రూపంలో వచ్చేలా చూడాలని పార్లమెంటు సభ్యులను కోరారు. ఇందుకు ముగ్గురితో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అయితే పార్లమెంటు సభ్యులందరూ కేంద్రం నుంచి తొలుత బయటకు రావాలని చంద్రబాబును గట్టిగా కోరారు. అయితే కేంద్రం నుంచి బయటకు రావడం పెద్ద పని కాదని, ఆ పని చేయాలంటే ముందు కేంద్రం నుంచి తమకు స్పష్టత రావాల్సి ఉంటుందన్నారు. కేంద్రం హామీలపై చేతులెత్తేస్తే నిమిషం కూడా కేంద్ర ప్రభుత్వంలో కొనసాగబోమని, ఆ నిర్ణయాన్ని తాను ఎప్పుడు తీసుకోవాలో? అప్పుడు తీసుకుంటానని చెప్పారు. మొత్తం మీద చంద్రబాబు పాత వ్యూహాన్నే ఈ పార్లమెంటు సమావేశాల్లోనూ అమలుపర్చనున్నారు.