రాజధాని భూములు ఇవ్వడానికి రైతులు స్వచ్ఛందంగా ఇవ్వడానికి ముందుకొచ్చారు. చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు దాదాపు ముప్ఫయి వేల ఎకరాలకు పైగానే రైతులు భూసమీకరణ కింద ఇచ్చారు. వీరికి భూములు ఇచ్చినందుకు ప్రభుత్వం వారికి లాటరీల ద్వారా ప్లాట్లను కూడా కేటాయించింది. గరీబు, జరీబ భూములని రెండు విడదీసి కమర్షియల్ ఏరియాలోనూ, నివాస ప్రాంతాల్లోనూ భూములిచ్చిన రైతులకు ప్లాట్లను కేటాయించింది. అయితే అత్యంత పారదర్శకంగా పాలన జరుగుతోందన్న చంద్రబాబు మాటలు ఒట్టివేనని తేలిపోయాయి. అసలు భూమే లేకుండా తనకు భూమి ఉందని చెప్పి ప్రభుత్వం నుంచి ప్లాట్లను కొట్టేసి అమ్మేసుకున్న వైనం వెలుగు చూడటంతో రాజధాని భూముల అవినీతి బట్టబయలయింది.
లేని భూమి ఉందంటూ....
గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలంలో ఈ విషయం వెలుగు చూసింది. గుంటూరుకు చెందిన పఠాన్ గౌస్ ఖాన్ తుళ్లూరు మండలంలోని సర్వే నెంబర్ 201లో ఎకరం జరీబు భూమిని ప్రభుత్వానికి రాజధాని నిర్మాణం కోసం ఇచ్చినట్లుగా చూపారు. ఈ సర్వే నెంబర్లో ఏ పేరూ లేదు. అయినా అధికారులు గౌస్ ఖాన్ కు లాటరీలో 500 గజాల విల్లా, 500 గజాల నివాస స్థలాన్ని కేటాయించారు. అయితే వీటిని గౌస్ ఖాన్ వెంటనే అమ్మేసుకున్నారు. అయితే తీరా ఆ ప్రాంత రైతులకు అనుమానం వచ్చి ఎవరీ గౌస్ ఖాన్ అని విచారించగా అసలు విషయం బయపడింది. అసలు గౌస్ ఖాన్ కు ఆ ప్రాంతంలో భూమే లేదని తేలిపోయింది.
విచారణకు సీఎం ఆదేశం....
సీఆర్డీఏ అధికారులు, డాటా ఎంట్రీ ఆపరేటర్ సహకారంతో గౌస్ ఖాన్ ఈ దందాకు తెరతీసిసట్లు తేలింది. సీఆర్డీఏ అధికారుల సహకారంతోనే లేని భూమిని ప్రభుత్వానికి ఇచ్చినట్లుగా రికార్డుల్లో చూపి గౌస్ ఖాన్ పెద్దయెత్తున సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. గతంలో కూడా ఒక రైతు ల్యాండ్ పూలింగ్ కు భూమి ఇవ్వకుండానే లక్షల రూపాయల కౌలు తీసుకున్నారు. రాజధాని భూ దందా బయటపడటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించారు. బాధ్యులు ఎంతటి వారైనా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసు కేసు నమోదు చేసి శాఖాపరమైన దర్యాప్తుకు ఆదేశించారు. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. రాజధాని నిర్మాణం కాకముందే పెద్దయెత్తున అవినీతి బయటపడుతుందన్న ఆరో్పణలు విన్పిస్తున్నాయి.